జెడ్పీ సీఈఓగా నాగలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓగా నాగలక్ష్మి

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

విజయనగరం రూరల్‌: జిల్లా పరిషత్‌ సీఈఓగా ఇ.నాగలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీసేసింది. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న బీవీ సత్యనారాయణకు అనకాపల్లి జిల్లా డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖ జిల్లా డీడీవోగా పనిచేస్తున్న నాగలక్ష్మికి ఉద్యోగోన్నతిపై విజయనగరం జెడ్పీ సీఈవోగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలి

కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి

విజయనగరం అర్బన్‌: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ర్యాంప్‌ పథకంలో భాగంగా స్థానిక మహారాజా కోటలోని ఆనందగజపతిరాజు ఆడిటోరియంలో ‘లఘు ఉద్యోగ్‌ భారత్‌’ ఆధ్వర్యంలో ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వెండార్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలని కోరారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో జిల్లా ఆర్ధిక ముఖచిత్రం మారుతుందని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పరిశ్రమల శాఖ జీఎం ఎం.వి.కరుణాకర్‌, వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఏపీఎంఐపీ పీడీ పీఎన్‌వీ లక్ష్మీనారాయణ, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటకృష్ణ, ఎల్‌యూబీ జాతీయ కమిటీ సభ్యులు ఎ.కె.బాలాజీ, ఎన్‌ఎస్‌ఐసీ బ్రాంచ్‌ మేనేజర్‌ టి.కామేశ్వరి, ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌ఓ ఏడీ డీవిఎస్‌ఆర్‌ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు

విజయనగరం క్రైమ్‌: మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్పం, చైతన్యం, అభ్యదయం 2.0’ పేరుతో వంద రోజుల కార్యక్రమం తలపెట్టినట్టు విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి తెలిపారు. రేంజ్‌ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో ఆస్తి జప్తు, ఎన్డీపీఎస్‌ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 19 కేసుల్లో 18 మంది ముద్దాయిల నుంచి సుమారు రూ.11.63 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజింగ్‌ చేసినట్టు తెలిపారు. మరో 32 మందికి జైలు శిక్ష పడిందన్నారు. గంజాయి విక్రయం, రవాణాదారులను ఉపేక్షించవద్దని ఐదు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement