విజయనగరం గంటస్తంభం: అయ్యా..మా బిడ్డ పెద్ద చదువు చదివితే మా దరిద్రం వదులుతాదనుకున్నాం. సర్కారు సాయం చేస్తాదంటే అప్పులు చేసి చేసి కాలేజీలో చేర్పించినాం. తీరా చూస్తే సర్కారు మొహం చా టేసింది. ఇప్పుడు కాలేజీ వాళ్లు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. అటు ఉద్యోగాల్లేవు...ఇటు భృతి లేదు... మా బతుకులు నట్టేట మునిగినట్లేనా?..ఇది జిల్లాలోని ఓ నిరుద్యోగి తండ్రి ఆవేదన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, త ల్లిదండ్రుల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి.
నమ్మించి గొంతు కోశారు..
ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీలిచ్చి, అధికార పీఠమెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా ప్రభుత్వం వస్తే చదువులకు కష్టముండదు..నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటాం అని చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మూటలయ్యాయి. రూ.5,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయి ఉంటే, విద్యార్థి సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్ప సర్కారులో చలనం రాలేదు. తీరిగ్గా కేవలం రూ.1,200 కోట్లు విదిల్చి, అంతా చేసేశాం అని డబ్బాలు కొట్టుకోవడం చూస్తుంటే..విద్యార్థులను ఎంతలా వంచించారో అర్థమవుతోంది.
భృతి అందని ద్రాక్షేనా?
నిరుద్యోగికి నెలకు రూ.3,000 ఇస్తాం...ధీమాగా ఉండండి అన్న హామీ ఏమైంది..ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఒక్క పైసా కూడా నిరుద్యోగి ఖాతాలో పడలేదు. పట్టణాల్లో రూము అద్దెలు కట్టలేక, రీడింగ్ రూమ్ ఫీజులు భరించలేక యువత సతమతమవుతున్నారు. గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, ఇక్కడ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక గంజి తాగి గడుపుతున్నారు.
నోటిఫికేషన్లు లేవు..బతుకు దెరువు లేదు!
చదువు పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ల ఊసే లేదు. ఒకవైపు చదువు కోసం పెట్టిన ఖర్చు తడిసి మోపెడవుతుంటే, మరోవైపు వయస్సు మారిపోతుందన్న భయం నిరుద్యోగులను వెంటాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి, పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజు బకాయిలను విడుదల చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విద్యార్థి లోకం సర్కారు కోటను కదిలిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగం లేదు..భృతీ లేదు
ఊరించిన భృతి..ఉసూరుమనిపించిన సర్కారు
కోచింగ్ ఫీజులు కట్టలేక..ఊరు వెళ్లలేక సతమతం
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు,
నిరుద్యోగుల ఆవేదన


