విజయనగరం ఫోర్ట్: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమం అమలుపై పర్యవేక్షణను గాలికి వదిలేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం తూతూమంత్రంగా జరుగుతోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై పర్యవేక్షణ కొరవడడంతో వైద్యసిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైద్యులు డుమ్మా కొట్టడం వల్ల వారు అందించాల్సిన సేవలు రోగులకు అందని పరిస్థితి నెలకొంది. సంపన్నులకే ఉండే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమంపట్ల అలసత్వం వహిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఫ్యామిలీ డాక్టర్
జిల్లాలో 48పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఆదివారం మినహా ప్రతిరోజు ఫ్యామిలీడాక్టర్ కార్యక్రమం నిర్వహించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యామిలీ డాక్టర్ శిబిరాన్ని నిర్వహించాలి. శిబిరానికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందించాలి. మెరుగైన చికిత్స అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి బీపీ, సుగర్, జ్వరం, దగ్గు, జలుబు ఉన్న రోగులు ఎక్కువగా వస్తారు. బీపీ, సుగర్ రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులు అందించాలి. గర్భిణులకు వైద్య తనిఖీలు నిర్వహించాలి. హిమోగ్లోబిన్ ( హెచ్‌బి) తక్కువగా ఉన్నవారికి హెచ్‌బీ పెరగడానికి ఐరన్ మాత్రలు, సుక్రోజ్ ఇంజక్షన్లు అందించాలి. అదేవిధంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలు అనారోగ్యంతో బాధపడతున్నవారు ఉంటే వారికి వైద్య సేవలు అందించాలి. మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యుడు సేవలు అందించాల్సి ఉంది. కాని ఈకార్యక్రమం జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి:
సిబ్బందితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు
కార్యక్రమంపై కొరవడిన పర్యవేక్షణ
టీడీపీ సర్కార్ హయాంలో గాలికి వదిలేసి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
కానరాని వైద్యులు
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 11 గంటలైనా కొన్నిచోట్ల వైద్యులు శిబిరానికి రావడం లేదు. మరి కొన్ని చోట్ల మధ్యాహ్నం 12, ఒంటి గంటకే వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల వైద్యులు రాకుండానే సిబ్బందితో మమ అనిపించేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి తూట్లు పడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
డుమ్మా కొడితే చర్యలు
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఎవరైనా వైద్యులు డుమ్మా కొట్టినా, మధ్యలో వెళ్లిపోయినా చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్‌ఓ


