షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం లేకుండా వైరింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం లేకుండా వైరింగ్‌ చేయాలి

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా విద్యుత్‌ వైరింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రిలో అత్యవసర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్‌ పైప్‌ లీకేజ్‌ లేకుండా చూడాలని, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన అదనపు పంపులు నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ, ఏపీఎంఎస్‌ఐడీసీ డీఈ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సోలార్‌ ప్యానల్స్‌ దగ్ధం

గజపతినగరం రూరల్‌: మండలంలోని తమ్మారాయుడుపేట గ్రామానికి చెందిన కోరాడ పైడితల్లి పొలంలో కోసి ఆరబెట్టిన మొక్కజొన్న తోటలో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సోలార్‌ ప్యానల్స్‌, మోటరు వైర్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.1,50,000 ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక అధికారి రవిప్రసాద్‌ ఆధ్వర్యంలో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాల్చిన సిగరెట్టు/ బీడీ ఆజాగ్రత్తగా పారవేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

త్వరితగతిన పైడితల్లి ఆలయ అభివృద్ధి

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఇన్‌చార్జ్‌ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ పనులపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను స్వీయపర్యవేక్షణ చేసి, పలు సూచనలు, సలహాలు అందించారు. నిర్ణీత సమయంలోపు పనులు పూర్తిచేయిస్తామని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి మరింతగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

అనుమానంతో భార్యపై దాడి

విజయనగరం క్రైమ్‌: తాళి కట్టిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త తారస్థాయికి చేరింది. కన్న వారింట్లో ఉంటున్న ఇల్లాలి వద్దకు వచ్చిన భర్త కత్తితో ఆమె మెడపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పల్లివీధిలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి టూటౌన్‌ ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలం అమకాంకు చెందిన రాంపల్లి శ్రీనివాస్‌తో విజయనగరానికి చెందిన సాయికళకు 2012లో పైళ్లెంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా హేమశ్రీ, యశ్వంత్‌లు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పిల్ల లను తీసుకుని విజయనగరంలోని కన్నవారింటికి వచ్చి సాయికళ ఉంటోంది. అప్పుడుప్పుడు అత్తగారి ఊరైన అమకాం వెళ్లి వస్తూ ఉంటుంది. భర్త శ్రీనుకూడా విజయయనగరంలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. కన్నవారింట్లో ఉంటున్న భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనమానంతో భార్యతో భర్త గొడవపడి కత్తితో ఆమైపె దాడి చేశాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సాయికళను ఆమె అన్నయ్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. ఆమె కోలుకున్న అనంతరం తన భర్తే తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement