సాక్షి, పార్వతీపురం మన్యం: ఏళ్ల తరబడి ఆ భూములు గిరిజనుల సాగులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలూ వారి పేరిటే ఇచ్చారు. అదే భూమిపై కాస్త సర్వే నంబర్లు అటూఇటు మార్చి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. దర్జాగా తన ఫొటో పెట్టుకుని, కింద ఉన్న సంతకాన్ని సైతం చెరిపేసి, ఆ భూమి తనదంటూ దౌర్జన్యానికి దిగాడో వ్యక్తి. బాధిత గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా..ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరినా రెవెన్యూ అధికారుల నుంచి స్పందన ఉండడం లేదు. జిల్లా అధికారులే తమ మొర వినాలని బాధిత గిరిజనులు కోరుతున్నారు. సీతంపేట మండలం గొయిది పంచాయతీ ఎంగుపేట రెవెన్యూ పరిధి జక్కరవలస గ్రామంలో సర్వే నంబరు 19–2, 19–3ల్లో దాదాపు పదెకరాల వరకు భూమిని తాతముత్తాతల కాలం నుంచి సవర సన్నాయి, సవర కరువయ్య కుటుంబసభ్యులు సాగు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన అసలు పాస్ పుస్తకాలు కూడా వారి వద్ద ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం సవర శంకరరావు అనే వ్యక్తి అది తన భూమి అంటూ వచ్చాడు. సాగులో ఉన్న గిరిజనులు అడ్డుకోవడంతో వెనుదిరిగాడు. కొద్దిరోజుల తర్వాత నకిలీ పత్రాలు సృష్టించాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పట్టాల్లో గతంలో ఉన్న పేరును చెరిపేసి, తన ఫొటో అతికించి, రెవెన్యూ అధికారుల సంతకాలతో పత్రాలు సృష్టించడం గమనార్హం. దీనిపై బాధిత గిరిజనులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. కొంతకాలంగా ఈ భూమి ఎవరి పేరిట ఉందో, ఎక్కడ మార్చారో తెలియజేయాలని ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదంటూ అధికారులు దాటవేశారు. దీంతో చేసేదిలేక గిరిజనులు శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చారు. తాము గిరిజనులం కావడం వల్లే అధికారులు సైతం మోసం చేస్తున్నారని, కళ్ల ముందే అన్యాయం కనిపిస్తున్నా ఏ ఒక్కరూ న్యాయం చేయడం లేదని వారు వాపోయారు.
పేర్లు మార్చేసి..భూములు కొట్టేసి


