పార్వతీపురం రూరల్: ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా అధికారుల అలసత్వం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ) పార్వతీపురం ఐటీడీఏ వద్ద శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. జీవో 27 ప్రకారం తమను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పాలక రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 417 మందికి పదోన్నతులు లభించగా, పొరుగున ఉన్న సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అక్కడ ఏప్రిల్ 1 నుంచే పదోన్నతులు అమల్లోకి వచ్చినా.. పార్వతీపురంలో మాత్రం 33 మంది ఉపాధ్యాయులకు నేటికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. జీవో 45 నిబంధనల ప్రకారం క్లియర్ వేకెన్సీ ఉన్న చోట గిరిజన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలుమార్లు పీఓ, డీడీలకు విన్నవించినా నిర్లక్ష్యం వీడడం లేదని, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయకుంటే శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


