విజయనగరం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారిలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ..చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్‌లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్‌కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్‌లో సత్తా చాటి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
ఇవి గుర్తుంచుకోండి..
● పరీక్ష మీ తలరాతను మార్చలేదు.
● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం.
● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు.
ఇవి చేస్తే మేలు..
పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహపూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి.
ఓటమి నుంచే విజయం వరిస్తుందని..స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి.
పరీక్షల్లో ఫెయిలైనా.. మార్కులు తక్కువొచ్చినా.. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి.
జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి.
అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి.
ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు.
అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యాన్ని నింపాలి.
ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి.
మార్పు తెచ్చే మార్గాలు ఎన్నో
చదువులో సాధించే మార్కులే శాశ్వతం కాదు
ఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా, మళ్లీ ప్రయత్నించి ఓటమి నేర్పిన పాఠాలతో జీవితంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మార్కులు తక్కువ వస్తే జీవితమే ఆగిపోయినట్లు భావించకుండా మళ్లీ ప్రయత్నించాలి. అపజయం తర్వాత వచ్చే విజయం ఎంతో బలాన్ని అందిస్తుంది.
డాక్టర్ సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం


