మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

బొబ్బిలిరూరల్‌: మండలంలోని మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్‌ పువ్వల మాధవరావుపై అదే గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు మంగళవారం రాత్రి హత్యాయత్నానికి తెగబడ్డాడు. తన పక్కనే ఉన్న స్నేహితుడి సహయంతో మాజీ సర్పంచ్‌ మాధవరావు త్రుటిలో తప్పించుకోగా స్నేహితుడు రౌతు రామ్మూర్తి కాలిపై గొడ్డలి వేటు పడడంతో గాయమైంది. ఈ ఘటనపై ఏఎస్సై కొండలరావు,స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మే నెలలో గ్రామంలో జరగనున్న గ్రామదేవత పండగను పురస్కరించుకుని పండగ మూడు రోజుల పాటు మద్యం బెల్ట్‌ షాపు నిర్వహణకు లక్షల్లో వేలం పాట జరిగింది. వేలంపాటలో పాల్గొన్న అప్పారావు తనకు పాట దక్కలేదన్న అక్కసుతో వేలం పాటను వీడియోతీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మాజీ సర్పంచ్‌ మాధవరావు, అప్పారావుల మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో మాధవరావు, అప్పారావుపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన అప్పారావు మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆటోస్టాండ్‌ వద్ద కానాపై స్నేహితుడు రామ్మూర్తితో మాధవరావు చర్చిస్తుండగా మోటారు సైకిల్‌పై వచ్చి వెనుకనుంచి గొడ్డలితో మాధవరావును నరికేందుకు ప్రయత్నించాడు. మాధవరావు త్రుటిలో తప్పించుకోగా అప్పారావు అక్కడినుంచి పరారయ్యాడు. హత్యాయత్నం ఘటనపై మాధరావు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

నిందితుడి బైక్‌ దగ్ధం

నిందితుడు అప్పారావు మోటారుసైకిల్‌ను అక్కడే వదిలి పరారవగా మంగళవారం రాత్రి మోటారుసైకిల్‌కు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మోటార్‌ సైకిల్‌ పూర్తిగా దగ్ధమైంది. మోటార్‌ సైకిల్‌ దగ్ధమైన విషయం తమ దృష్టికి రాలేదని ఏఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement