లారీ ఢీకొని మాజీ సర్పంచ్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మాజీ సర్పంచ్‌ దుర్మరణం

Mar 3 2026 7:34 AM | Updated on Mar 3 2026 7:34 AM

పార్వతీపురం రూరల్‌: లారీ ఢీ కొనడంతో సంగంవలస మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు గంట రామకృష్ణ (58) దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రామకృష్ణ ఉదయం 6 గంటల సమయంలో బెలగాం అగ్రహారం వీధి సమీపంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

విజయనగరం టౌన్‌: విద్యార్థులకు అందివ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, గండేటి శ్రీను, టి.వి.దుర్గారావులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరై, కనీస సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికీ జిల్లాలోని చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు సొంత భవనాలు లేవని, చాలాచోట్ల విద్యార్థులకు బెడ్లు లేక నేలమీదే నిద్రిస్తున్నారని, సరిపడ మెస్‌ చార్జీలు, మెయింటెనెన్స్‌ ఖర్చులు పెంచాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పీఎఫ్‌ చెల్లించకపోవడంపై జేసీకి ఫిర్యాదు

విజయనగరం ఫోర్ట్‌: ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్‌ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలంతా తమకు పీఎఫ్‌ చెల్లించకపోవడంపై జేసీ సేతుమాధవన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం జేసీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 72 ఆరోగ్యమిత్రలకు శ్రీమేన్‌ పవర్‌ సర్వీసెస్‌ అనే ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, అయితే సదరు ఏజెన్సీ గత ఏడు నెలలుగా ఆరోగ్యమిత్రల పీఎఫ్‌ను జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రావాల్సిన పీఎఫ్‌ బకాయిలను తమ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ తీర్మానం లేకుండా పనులెలా?

విజయనగరం ఫోర్ట్‌: పెదవేమలి గ్రామంలోని ఎస్సీల శ్మశానవాటికలో అక్రమంగా పనులు చేపడుతుండడంపై ఆ గ్రామ సర్పంచ్‌ వర్రి పాపునాయుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన వెళ్లి, గ్రామసభ, పంచాయతీ తీర్మానం లేకుండానే శ్మశానవాటికలో పనులు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మెరుగైన పశువైద్యం

అందించండి

నెల్లిమర్ల: నగరపంచాయతీలోని పాడిరైతుల పశువులకు మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌ చేశారు. స్థానిక పశుసంవర్థక శాఖ ఏడీ చక్రవర్తిని ఆయన సోమవారం కలిసి పాడి పశువుల ఆరోగ్య సమస్యలను వివరించారు. పశువులు అనారోగ్యానికి గురై పాల దిగుబడి తగ్గిపోతోందన్నారు. ముఖ్యంగా దేశవాళీ ఆవుల్లో నట్టలు చేరడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి పశువు ఆరోగ్యం తనిఖీ చేసి, అవసరమైన వాటికి మందులు అందివ్వడం జరుగుతుందని ఏడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement