ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై శనివారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యార్ధిదశలో ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని, ప్రాక్టికల్స్‌తో పాటు థియరీ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు, తప్పిదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్వో సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలు జల్లాలోని 119 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయని, వీటికి మొత్తం 39,037 (ఫస్టియ ర్ 19,759, సెకెండియర్ 19,278) మంది విద్యార్థు లు హాజరు కానున్నట్లు వివరించారు. థియరీ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. డీఈసీ కన్వీనర్, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు ఇంటర్ పరీక్షల నిర్వహణ విధానాన్ని వివరించారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, జిల్లా ప్రజారవాణాధికారి జి.వరలక్ష్మి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కన్వీనర్ రూపవతి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్ పాల్గొన్నారు.


