ఉపాధి రక్షణకు ప్రజా ఉద్యమం
కొమరాడ: ఉపాధి హామీ పథకం చట్టాన్ని కాపాడేందుకు ప్రజా ఉద్యమం చేపడతామని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అన్నారు. మండలంలోని నందాపురం గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ బచావో కార్యక్రమాన్ని ఆ పార్టీ అధిష్టానం సూచనల మేరకు శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా కార్యాలయ ఇన్‌చార్జ్ కోలా కిరణ్‌కుమార్, ఓబీసీ నియోజకవర్గ చైర్మన్ సిరిసిపల్లి సాయిశ్రీనివాస్ మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వంలో పేదలు ఆకలి తీర్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఉపాధి చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడం దారుణమన్నారు. 90 శాతం నిధులకు బదులుగా కేంద్రం 60 శాతమే ఇస్తామనడం అన్యాయమన్నారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 శాతం నిధులను ఎలా సమకూరుస్తుందన్నారు. ఏడాదికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. మండుటెండల్లో రెండు పూటల పనులు నిర్వహించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ముద్దు – జీ రామ్‌జీ వద్దు... అంటూ నినాదాలు చేశారు.


