మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర
విజయనగరం రూరల్: మహిళలు తమ శక్తిని చాటి అన్ని రంగాల్లో రాణించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర అన్నారు. మండలంలోని కోరుకొండ సమీపం, వైజాగ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో జేఐటీఓ మహిళా విభాగం శనివారం నిర్వహించిన ధాకడ్ కొరియన్ క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు, విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి, తమ ఽశక్తిని చాటి చెప్పాలన్నారు. ఇటీవల ముగిసిన మహిళల వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత మహిళా జట్టు విజేతగా నిలిచిందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీచరణి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందని అన్నారు. నేటి యువత, మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అంతర్జాతీయ వేదికలపై క్రీడల్లో రాణించాలన్నారు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించడానికి ఇటువంటి టోర్నీలు వేదికలుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసహస్రను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


