రిపబ్లిక్ డే ఏర్పాట్లు పరిశీలన
విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ బ్యారెక్స్‌లో జరగనున్న గణతంత్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ దామోదర్ సిబ్బందిని ఆదేశించారు. ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజల వాహనాలను వేర్వేరుగా పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీఐలు ఆర్.వి.ఆర్.కే.చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సురినాయుడు, కె.కుమారస్వామి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐలు, సాయుధ పోలీసులు పాల్గొన్నారు.
బొబ్బిలిరూరల్: నిరుద్యోగులు గత ప్రభుత్వంలో తీసుకున్న వాహనాలు, ఇతర రుణాలకు వడ్డీ మాఫీ వర్తిస్తుందని, రుణ గ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.వెంకటేశ్వరరావు సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని ఎస్సీ రుణాలు పొందిన లబ్ధిదారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ కులాలకు చెందిన వారికి రాయితీపై అనేక పథకాల కింద రుణాలు మంజూరు చేసిందని, వాటిని తిరిగి చెల్లించలేక పోతున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. గతంలో తీసుకున్న రుణ బకాయిలకు అసలు మొత్తాన్ని చెల్లిస్తే చాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ పి.రవికుమార్ పాల్గొన్నారు.
శృంగవరపుకోట: మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి కొర్రు గ్రామానికి చెందిన రెండేళ్ల వయస్సు ఉన్న గిరిజన బాలుడు కేరంగి క్రాంతికుమార్ శనివారం మృతిచెందాడు. గతంలో ఇదే పంచాయతీకి చెందిన పలువురు చిన్నారులు మృతిచెందారు. వీరికి వ్యాధినిరోధక టీకాలు వేయడంలో చూపిన అలసత్వమే ప్రధాన కారణమని కేంద్ర వైద్యబృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. తాజాగా కేరంగి మంగళయ్య, అనూష దంపతుల తొలి సంతానమైన క్రాంతికుమార్ మృతిచెందడంతో పంచాయతీ వాసుల్లో మళ్లీ అలజడి మొదలైంది. చిన్నారి మృతికి బ్లడ్ క్యాన్సర్‌తో పాటూ, కిడ్నీ సమస్యలు కారణమని కొట్టాం వైద్యురాలు మానస తెలిపారు.
మక్కువ: దుగ్గేరు పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించాలని హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ అసిరి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీ కన్వీనర్ రాయల సుందరరావు మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తూ ఉంటే కొంత మంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటివారంతా మంత్రి సంధ్యారాణితో ఈ ప్రాంతంలో పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయ ట్లేదని, జీవో నంబర్ 84 విడుదల చేయలేదని, మంత్రివర్గ తీర్మానం జరగలేదని బహిరంగ ప్రకటన విడుదల చేయించాలన్నారు. సురాపాడు మినీ రిజర్వాయర్ కావాలని ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి మొరపెట్టుకుంటే కనీసం పట్టించుకోలేదని వాపోయారు.
రిపబ్లిక్ డే ఏర్పాట్లు పరిశీలన


