శంబర జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తు లు వచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. జాతర ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. వనంగుడిలో అమ్మవారి ని దర్శించుకుని, ఆలయం వెనుకన ఉన్న పురాతన వేపచెట్టును సందర్శించారు. అనంతరం వనంగుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూలను పరిశీలించి ఈఓ శ్రీనివాస్, సీఐ రామకృష్ణకు పలు సూచనలు చేశారు. మక్కువ, సాలూరు రోడ్డు అధ్వానంగా ఉందని, ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం కనిపించడంలేదంటూ మండిపడ్డారు. అనంతరం వనంగుడి వద్ద ఏర్పాటుచేసిన రెండు పార్కింగ్ ప్రదేశాలను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. రోడ్లపై ఫ్లెక్సీలు తొలగించి, భక్తులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హోర్డింగ్‌లు ఏర్పాటుచేసిన ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.10వేలు రుసుము వసూళ్లు చేయాలని పంచా యతీ అధికారులను ఆదేశించారు. గ్రామంలో సిరిమాను తిరిగే వీధులన్నీ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల ని పంచాయతీ అధికారులకు వివరించారు. ప్రతీ ఇంటి ముందు మహిళలు రంగవల్లికలు వేసేలా గ్రా మంలో దండోరా వేయించాలన్నారు. ఆలయాల వద్ద మొక్కు బడులు చెల్లించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీధిలో చెత్తవేస్తే రూ.5 వేలు అపరాధ రుసుం విధించాలన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రతీ అంశం ఫొటో రూపంలో పంపించాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సబ్‌కలెక్టర్ వైశాలి ఉన్నారు.
ఆధార్ చూపించాల్సిందే..
గ్రామస్తులు గ్రామం నుంచి బయటకు వెళ్లి, తిరిగి గ్రామంలోకి వస్తే పార్కింగ్ ప్రదేశాల వద్ద ఆధార్ కార్డు చూపించాలని ఏఎస్పీ వంగలపూడి మనీషారెడ్డి గ్రామస్తులకు సూచించారు.


