చీపురుపల్లిలో పట్టపగలు చోరీ
● తులం బంగారు ఆభరణాలు,
రూ.50 వేల నగదు అపహరణ
చీపురుపల్లి: పట్టణ నడిబొడ్డున ఆంజనేయపురంలో పట్టపగలు చోరీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ పగటి పూటే తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి దర్జాగా తులం బంగారం, రూ.50 వేలు నగదు అపహరించుకుపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు వెంకటలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఆంజనేయపురంలో మెయిన్‌రోడ్‌ను ఆనుకుని నివాసం ఉంటున్న డి.వెంకటలక్ష్మి పండ్ల వ్యాపారం చేసుకుంటుంది. ప్రతీ రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం పది గంటలకు ఇంటికి తాళాలు వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకునేందుకు వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేసరికి బీరువా తెరిచి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించింది. దీంతో బీరువాలో చూడగా బంగారం, నగదు కనిపించ లేదు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చింది.
వెనుక తలుపు గడియను తప్పించి
వెంకటలక్ష్మి ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపు గడియను తప్పించి లోపలికి ప్రవేశించిన దుండగుడు బీరువా తాళాలు వెతికి పట్టుకుని తెరిచి అందులో ఉన్న అర తులం చెవిదిద్దులు, అర తులం ఎత్తు గొలుసులుతో బాటు రూ.50 వేలు నగదు అపహరించుకుపోయాడు.
రంగంలోకి క్లూస్ బృందం
ఇదిలా ఉండగా చోరీకు గురైన ఇంటికి శనివారం క్లూస్ బృందం వచ్చి ఆధారాలు, వేలిముద్రలు సేకరించింది. మరోవైపు ఎస్‌ఐ దామోదరరావు నేతృత్వంలో సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. పరిసరాల్లోని నివాసితులపై నిఘా ఉంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దామోదరరావు తెలిపారు.


