కార్యకర్తలే మన బలం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలే మన బలం

Jan 22 2026 8:31 AM | Updated on Jan 22 2026 8:31 AM

కార్య

కార్యకర్తలే మన బలం

ఏ ఎన్నికలు జరిగినా విజయమే లక్ష్యం

పంచాయతీ యూనిట్‌గా గ్రామ కమిటీలు

చిత్తశుద్ధి కలిగిన వారికి బాధ్యతలు

క్రెడిట్‌ చోరీలతో మోసకారి పాలన

విజయనగరం:

కార్యకర్తలే మన బలమని, సంస్థాగతంగా పంచాయతీ స్థాయిలో పార్టీబలోపేతమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు నియమించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీలోగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కమిటీల నియామకం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామకమిటీలో 70 నుంచి 100 మంది సభ్యులు ఉండేలా నియామకాలు చేపట్టాలన్నారు. రానున్నరోజుల్లో గ్రామ కమిటీల్లోని సభ్యులే జగనన్న సైన్యంగా పార్టీని ముందుకు నడిపిస్తారన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఉద్ఘాటించారు. జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన నగరంలోని పూలబాగ్‌ ప్రాంతంలోని జగన్నాథ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన నేతలు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సంస్థాగత బలోపేతం, అధికార పార్టీ నేతల అరాచకాలు, అక్రమాలను ఆడ్డుకోవటంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అందరి సమన్వయంతో కమిటీల ఏర్పాటు

శాసనమండలి విపక్షనేత బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి కమిటీల నియామకాన్ని సమర్ధవంతంగా చేపట్టాలని సూచించారు. అందరి సమన్వయంతో కమిటీలు నియమించాలని చెప్పారు. పార్టీలో ఎవ్వరూ తక్కువ కాదు.. ఎక్కువ కాదని, అంతా కలిసిగట్టుగా పని చేయాలన్నారు. అధికారం కోల్పోవడం కొత్త కాదని, దానిని మరలా సాధించుకోవడమే ముఖ్య కర్తవ్యమని పేర్కొన్నారు. మే, జూన్‌ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్చినెల మొదటి వా రం నుంచి నియోజకవర్గ స్థాయిల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో సామాన్యులు, రైతులు ఇబ్బందులు పట్టించుకోని చంద్రబాబు, లోకేశ్‌లు దావోస్‌ పర్యటనలో 99 పైసలకు భూములు అప్పనంగా కట్టబెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి దోచుకుతింటున్నారని.. విజయనగరం మండలంలో పని చేయకుండా దొంగ మస్తర్లు వేసి అధికారులు దోచుకున్నారని, ప్రశ్నిస్తే నాయకులకు ఇచ్చామంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానే స్వయంగా లేఖరాసినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. 19 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదని, ఈ ప్రభుత్వ పాలనపై ఆలోచన చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా గ్రీవెన్స్‌ డే పెట్టి అర్హులైన పింఛనుదారుల జాబితాను సిద్ధం చేసి తహసీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, విజయనగరం మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పాల్గొన్న నేతలు

గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమే లక్ష్యం

ఫిబ్రవరి 18లోగా గ్రామ కమిటీల ఎంపిక పూర్తి చేయాలి

ప్రతి కమిటీలో 70 నుంచి 100 మంది సభ్యులు ఉండాలి

గ్రామకమిటీ సభ్యులే జగనన్న సైన్యం

అర్హులైన పింఛన్ల లబ్ధిదారుల వివరాల సేకరణకు గ్రీవెన్స్‌ డే

మార్చి నుంచి నియోజకవర్గ స్థాయిల్లో విస్తృత స్థాయి సమావేశాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

లీడర్‌, క్యాడర్‌ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం: కురసాల కన్నబాబు

వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేసిన నాయకులు

రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలి. పార్టీ అదేశాల మేరకు గ్రామ కమిటీలతో పాటు జిల్లా/ మండల స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేసి పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగస్వాములు కావాలి. ఏ కష్టం వచ్చినా పార్టీ శ్రేణులకు అండగా ఉంటాం. జిల్లాలో అధికార పార్టీ నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ప్రజల ఇబ్బందులు వారికి పట్టవు. 2019–24లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారే తప్పా... కొత్తగా ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని వైఎస్సార్‌సీపీ చేపడితే కేంద్రమంత్రి టోపీ తగిలించుకుని ఫొటోలు దిగుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. ఎయిర్‌ఫోర్టు ప్రారంభోత్సవానికి ముందు ప్రతి మండల కేంద్రంలో విజయోత్సవ సభలు నిర్వహించాలి. 2029లో పార్టీ విజయమే లక్ష్యంగా కలిసిగట్టుగా పని చేద్దాం.

– మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం

పంచాయతీలుగా యూనిట్‌గా గ్రామ కమిటీ నియామకాలు చేపట్టాలి. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు క్రియాశీలకం. గ్రామ కమిటీలో 9 మంది సభ్యులతో పాటు, 7 అనుబంధ కమిటీల్లో 5 నుంచి 10 మంది సభ్యులను నియమించాలి. కమిటీల్లో సోషల్‌ మీడియా కన్వీనర్‌ పాత్ర అత్యంతం కీలకం. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇలా మొత్తంగా ఒక్కో పంచాయతీలో 70 నుంచి 100 మంది వరకు అవకాశం కల్పించాలి. రెండు పంచాయతీలకు ఒక కో ఆర్డినేటర్‌ను నియమించాలి. కమిటీల్లో నియామకమైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పిస్తాం. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలు వారి ద్వారానే అమలు చేయిస్తాం. – ఎ.హర్షవర్ధన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకులు

గ్రామ కమిటీల్లో పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారికి బాధ్యతలు అప్పగించాలి. కమిటీల నియామకంలో పారదర్శక పాటించాలి. పది కాలాలు పాటు ప్రజలకు మంచి పాలన అందించే పార్టీ వైఎస్సార్‌సీపీయే. అటువంటి పార్టీని బలోపేతం చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందిద్దాం. అందుకు క్యాడర్‌ అంతా సమాయత్తం కావాలి.

– శంబంగి వెంకట చినఅప్పలనాయుడు,

బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త

చంద్రబాబు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్‌ చోరీ చేస్తూ మోసకారి పాలన సాగిస్తున్నారు. పోలీసుల కనుసన్నల్లో పాలన సాగించే దుస్థితికి దిగజారిపోయారు. దీనిపై ప్రజలు చైతన్యవంతులయ్యారు. రానున్నది మన ప్రభుత్వమే.

– బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ, విజయనగరం

కార్యకర్తలే మన బలం 1
1/5

కార్యకర్తలే మన బలం

కార్యకర్తలే మన బలం 2
2/5

కార్యకర్తలే మన బలం

కార్యకర్తలే మన బలం 3
3/5

కార్యకర్తలే మన బలం

కార్యకర్తలే మన బలం 4
4/5

కార్యకర్తలే మన బలం

కార్యకర్తలే మన బలం 5
5/5

కార్యకర్తలే మన బలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement