యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనపై విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఉత్పాదకతను పెంచి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ర్యాంప్’ కార్యక్రమంపై బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువతకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం (ఈడీపీ)లో భాగంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారుల సమస్వయంతో శిక్షణ కార్యక్రమాలను మార్చినెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ర్యాంప్ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ఎంపికై ందని, ‘ప్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక’ కింద పరిశ్రమలకు అవసరమైన సంస్థాగత మద్దతు, మార్కెట్ సౌకర్యాలు, సులభతరంగా రుణాలు అందజేయడంపై దృష్టిసారించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం కరుణాకర్, ఏపీఐఐసీ జెడ్‌ఎం మురళీమోహన్, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఎల్డీఎం రమణమూర్తి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీపై అవగాహన అవసరం
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాణి
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఐసీటీసీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. హెచ్‌ఐవీ రోగుల వివరాల ఆన్‌లైన్ నమోదు పక్రియను పరిశీలించారు. హెచ్‌ఐవీ రిపోర్టులు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ బద్రి, కౌన్సిలర్ సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.
సందడిగా రంగోత్సవ్ పోటీలు
● ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 260 మంది విద్యార్థులు
నెల్లిమర్ల: వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి విజయనగరం జిల్లాల రంగోత్సవ్ పోటీలు సందడిగా సాగాయి. పోటీలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగోత్సవ్ పోటీలు జిల్లా సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. భారతీయ సంప్రదాయ జానపద కళలను విద్యార్థులకు తెలియజేసేందుకు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ డి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 32 పాఠశాలల నుంచి 260 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు అంశాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు. ప్రొగ్రాం కో ఆర్డినేటర్లుగా అధ్యాపకులు రమేష్, రజిత, సోమయాజులు, ఉమామహేశ్వరరావు, న్యాయనిర్ణేతలుగా మాత రామకృష్ణ, ఎల్.రామకృష్ణ, శంకరరావు వ్యవ హరించారు. డ్రాయింగ్ పోటీల్లో జయశ్రీ (ఒంపల్లి), హ్యాండ్ రైటింగ్‌లో లాస్యశ్రీ (దేవుపల్లి), రంగోలిలో గరివిడి ఎస్‌ఎస్‌డీఎస్‌ఎస్ స్కూల్ టీమ్, జానపద నృత్యంలో ఎస్.కోట జిల్లా పరిషత్ స్కూల్ టీమ్, రోల్ ప్లే పోటీల్లో గంట్యాడ ఏపీ మోడల్ స్కూల్ టీమ్ విజేతలుగా నిలిచాయి. జిల్లాస్థాయి విజేతలు ఈ నెల 23న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి రంగోత్సవ్ పోటీల్లో పాల్గొంటారు.
యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి
యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి


