డీమ్డ్ యూనివర్సిటీగా జీఎంఆర్ ఐటీ!
రాజాం సిటీ: రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా మారనుంది. గత కొద్ది సంవత్సరాలుగా నేషనల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఇక్కడ ఐటీ కళాశాల సేవలపై దృష్టిసారించింది. గత పదిహేడేళ్ల క్రితం ఐటీ కళాశాలను ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జునరావు ఏర్పాటుచేయగా ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇక్కడి కళాశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. విశాలమైన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ కళాశాల ద్వారా ప్రతి ఏడాది స్టెప్‌కాన్ నిర్వహించి దేశంలో పలు ఐటీ కళాశాలల విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఐటీ విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న ఈ కళాశాలకు ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి నుంచి యూనివర్సిటీ గుర్తింపు లభిస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో కళాశాల అధ్యాపకులతోపాటు విద్యార్థులు రాజాం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..
జీఎంఆర్ ఐటీ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా మారితే ఎన్నో ప్రయోజనాలు ఏర్పడనున్నాయి. స్వయంప్రతిపత్తి ఈ కళాశాలకు లభిస్తుంది. ఐటీ పాఠ్యాంశాల కరిక్యులాన్ని కళాశాలే తయారుచేసుకునే అవకాశం లభిస్తుంది. ఐటీలోని సివిల్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్ కోర్సులతో పాటు మరికొన్ని కొత్త కోర్సులను కృత్రిమ మేధస్సును సృష్టించే నూతన కోర్సులను కళాశాలలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. డిగ్రీ కోర్సులే కాకుండా డిప్లమో కోర్సులు ప్రవేశపెట్టడం, డిప్లమోతో అనుసంధానంగా ఐటీ కోర్సులు ప్రవేశపెట్టడం వంటివి కళాశాలలోనే నిర్వహించుకునేందుకు, సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. సీట్ల భర్తీ విషయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకునే వీలుంటుంది. ఇవే కాకుండా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆయా కంపెనీలకు సంబంధించిన కోర్సులను అమలు చేసే విధంగా ఏర్పాటుచేసుకుని విద్యార్థికి ముందుగానే ఉద్యోగావకాశాలు కల్పించడం, ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యను పూర్తిచేసే అవకాశం ఏర్పడుతుంది. కాలేజీలో అధ్యాపకులు, సిబ్బంది ఉద్యోగాల సంఖ్య పెంచే అవకాశం మెండుగా ఉంటుంది. అంతేకాాకుండా మెరుగైన గౌరవ వేతనాలు ఇక్కడ పనిచేసేవారికి లభించే వీలుంది. దేశంలో కొన్ని కాలేజీలు ఇలా డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొంది విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఉత్తరాంధ్రలో జీఎంఆర్ ఐటీ ఆ స్థానానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
త్వరలో ప్రకటించే అవకాశం


