బ్యానర్...
కఠినంగా శిక్షించాలి
విద్యార్థుల పట్ల అనుచిత వ్యాక్యలు చేస్తూ, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి. సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని మరలా అదే పాఠశాలలో నియమించడం నిబంధనలకు విరుద్ధం. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కీచక అవతారం ఎత్తడం దారుణం.
– వి.చిన్నబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
● ఇటీవల గరివిడి మండలం శివరాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవిస్తూ పాఠశాలకు వస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదుచేశారు. స్పందించకపోవడంతో ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తే పిల్లలను బడికి పంపించమంటూ హెచ్‌ఎంకు తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు.
● రాజాం మండలం డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన వికృతచేష్టలు భరించలేని విద్యార్థినుల ఫిర్యాదుతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడుని నిలదీశారు. దేహశుద్ధికి సిద్ధపడ్డారు. ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించి ఆయనను సస్పెండ్ చేశారు. పోలీసులు పోక్సోకేసు నమోదుచేశారు.
● బొబ్బిలి మండలం నారసింహునిపేట ఉన్నతపాఠశాలలో పనిచేసిన తెలుగు ఉపాధ్యాయుడు గతేడాది జూలై నెలలో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆయన ను డీఈఓ సస్పెండ్ చేశారు.
● గతేడాది డిసెంబర్ నెలలో కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమికో న్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థినులపట్ల వికృతచేష్టలు చేస్తూ, లైంగిక వేధింపులకు గురిచేయడం, తోటి టీచర్‌ను కులంపేరుతో అవమానపర్చడంపై ఆందోళనలు సాగాయి. ఆయనను తొలుత సస్పెండ్ చేశారు. తన పలుకుబడితో మళ్లీ పోస్టింగ్ వేయించుకున్నారన్న విమర్శలు వినిపించాయి.
కొత్తవలస:
గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః..
వేదకాలం నుంచి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. పరబ్రహ్మగా, అజ్ఞానాన్ని తొలగించి, శిష్యుడిని జ్ఞానం వైపు నడిపించే దైవ స్వరూపంగా గురువుకు సమాజంలో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత కలికాలంలో కొందరు గురువుల గాడితప్పుతున్నారు. కామాంధులుగా మారి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. గురువు అన్న పదానికి అర్ధాన్ని మార్చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు గురువులు అభంశుభం తెలియని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాల్సిన వారే బ్యాడ్‌టచ్ చేస్తూ ఆవేదనకు గురిచేస్తున్నారు. బడి అంటేనే భయపడేలా చేస్తున్నారు. బాలల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతున్నారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఘటనలతో తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. అందరికీ ఆదర్శవంతగా ఉండాల్సిన గురువులే మద్యం సేవించి పాఠశాలకు వస్తుండడం.. ఆ మత్తులో విద్యార్థుల ముందే చిందులు వేయడం చూసిన తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించేందుకు భయపడుతున్నారు.
పర్యవేక్షణ లోపం...
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ బడే ఆధారం. అక్కడ చెప్పిన పాఠ్యాంశాలు, విలువలతో కూడిన విద్యాబోధనే వారి ఉన్నతికి బాటలు వేస్తాయి. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు తప్పుదారిపట్టడం, కీచకులుగా మారుతుండడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. వీటిని సరిచేయాల్సిన ప్రభుత్వం బిక్కచూపులు చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదకుటుంబాల పిల్లల భవితవ్యానికి కృషిచేయాల్సిన ప్రభుత్వం... ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వసతులు సమకూర్చడంలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తప్పుచేసిన ఉపాధ్యాయులను శిక్షించకుండా విడిచిపెడుతున్నారన్న అపవాదు ఉంది. ఇది ఏకంగా విద్యావ్యవస్థనే చెద మాదిరిగా తినేస్తోంది. ఈ విధానం మారాలని, ఉపాధ్యాయుల పనితీరు, ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ అవసరమైని, తప్పుచేస్తే వెంటనే శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పేదపిల్లలకు భవిష్యత్తును చూపే ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని కోరుతున్నాయి.
కీచకులుగా మారుతున్న కొందరు
ఉపాధ్యాయులు
పలు పాఠశాలల్లో విద్యార్థినులపై
లైంగిక వేధింపులు
సభ్యసమాజం తలదించుకునేలా
ప్రవర్తన
ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెస్తున్న
గురువులు
పిల్లలను పాఠశాలకు పంపబోమని
తల్లిదండ్రుల ఆందోళన
బ్యానర్...


