చెట్ల కింద బోధన ఎన్నాళ్లు..?
వేపాడ: మా పాఠశాలకు భవనం లేదు.. ప్రతిరోజు చెట్లకిందనే తరగతులు నిర్వహిస్తున్నారు.. వర్షం కురిస్తే తరగుతుల సాగడంలేదు.. చెట్లకింద చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. తక్షణమే భవనం నిర్మించాలంటూ వేపాడ మండలంలోని మారిక గ్రామస్తులు తమ పిల్లలతో కలిసి ఎంఈఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. నాడు–నేడు నిధులు విడుదలైనా ఎందుకు భవనం నిర్మించలేదంటూ ప్రశ్నించారు. డీఈఓ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదంటూ బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీ రైతుసంఘం జిల్లా నాయకుడు జగన్ మాట్లాడుతూ మారిక ప్రాథమిక పాఠశాలలో కొత్తమారిక, పాతమారికకు చెందిన 27 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా భవనం లేకపోవడంతో బోధన సరిగా సాడంలేదని వాపోయారు. భవనం నిర్మించకుండానే రూ.8 లక్షల నిధులు డ్రాచేశారని, దీనిపై విచారణ జరపాలని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదుచేసినట్టు గుర్తుచేశారు. సాయంత్రమైనా ఆందోళన విరమించకపోవడంతో డీఈఓ మాణిక్యంనాయుడు ఎంఈఓ కార్యాలయానికి వచ్చారు. డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, గిరిజన సంఘాల నాయకులు, పాఠశాల చైర్మన్‌తో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి భవనం నిర్మించి అందులోనే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, మార్చినాటికి భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తామని తెలిపారు. నాడు–నేడు నిధులు అక్రమాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.
చెట్టు కిందనే పాఠాలు
మా అబ్బాయి మారిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు వస్తున్నా పాఠాలు చెప్పేందుకు గదులులేక చెట్టుకింద బోధిస్తున్నారు. ఏళ్ల తరబడి భవనం నిర్మించకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చింది.
– జాలారి సంధ్య, పాతమారిక
స్థలం ఉన్నా భవనం నిర్మించలేదు..
మారికలో పాఠశాల నిర్మాణానికి స్థలం ఉంది. నిధులున్నా నిర్మాణం చేపట్టలేదు. అధికారులు స్పందించి భవనం నిర్మించాలి.
– జి.వెంకటరావు, కొత్త మారిక
పాఠశాలకు భవనం నిర్మించాలంటూ పిల్లలతో కలిసి మారిక గిరిజనుల
ఆందోళన
వేపాడ ఎంఈఓ కార్యాలయం వద్ద
బైఠాయింపు
వచ్చేవిద్యాసంవత్సరానికి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన డీఈఓ
చెట్ల కింద బోధన ఎన్నాళ్లు..?
చెట్ల కింద బోధన ఎన్నాళ్లు..?
చెట్ల కింద బోధన ఎన్నాళ్లు..?


