వైద్య సేవలపై ఆరా..
గుర్ల: గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులు పూర్తిస్థాయి సంతృప్తి చేందేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మందుల నిల్వలు రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ రవికుమార్, వైద్యాధికారి శ్రీధర్ ఉన్నారు.
శతశాతం గ్రౌండింగ్ చేయాలి
● హౌసింగ్ జిల్లా అధికారి మురళీ మోహన్
నెల్లిమర్ల: జిల్లాలోని పట్టణాలకు తాజాగా 1009 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని వెంటనే గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ అధికారి, నెల్లిమర్ల ప్రత్యేకాధికారి జి.మురళీమోహన్ ఆదేశించారు. నెల్లిమర్ల హౌసింగ్ కార్యాలయంలో ఏఈ పవన్, వార్డు ఎమినటీస్ కార్యదర్శులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం కార్పొరేషన్‌లో 711, బొబ్బిలిలో 150, నెల్లిమర్లలో 90, రాజాంలో 50 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. నెల్లిమర్లకు తాజాగా మంజూరైన 90 ఇళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలో ఇప్పటికే గ్రౌండింగ్ అయిన ఇళ్లను సిబ్బందితో కలిసి పరిశీలించారు.
విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
చీపురుపల్లి: విధుల్లో అలసత్వం వహిస్తున్న సచివాలయ సిబ్బందికి తక్షణమే షోకాజు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని సచివాలయం–2, 5ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. హాజరు పట్టిక పరిశీలించి విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో విధులకు హాజరుకాని సిబ్బందికి షోకాజు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన పరిశీలించారు. మండల అధికారులకు తెలియకుండా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.
ఏటా ఈతలతో పశువులకు ఆరోగ్యం
● పశుసంవర్థక శాఖ జేడీ మురళీకృష్ణ
గంట్యాడ: ప్రతి పాడి పశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఏటా ఈత ఈనేలా చూడాలని, దీనివల్ల పాడిరైతుకు కూడా లాభం వస్తుందని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.మురళీకృష్ణ అన్నారు. లక్కిడాం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈనిన ప్రతిపశువు మూడు నెలలకు చూడికట్టేలా చూసుకోవాలన్నారు. ఆడపెయ్యిల పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. లేగ దూడలకు సకాలంలో ముర్రుపాలు, ఏలిక పాముల నివారణ మందు తాగించాలన్నారు. పెద్ద పశువులకు కూడా ఏడాదికి ఒకసారి పాముల నివారణ మందు పట్టించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ రెడ్డి కృష్ణ, పశు వైద్యులు బి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలపై ఆరా..
వైద్య సేవలపై ఆరా..
వైద్య సేవలపై ఆరా..


