పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు
● రసాయన వ్యర్థాలను చెరువుల్లోకి
విడిచిపెట్టడంపై విస్మయం
బొబ్బిలిరూరల్: గ్రోత్‌సెంటర్‌లోని పరిశ్రమల వ్యర్థాలు, రసాయనాలతో చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, స్థితిగతులు, ప్రాణాంతక వ్యాధులతో గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్న ఇక్కట్లపై ’ప్రాణాంతకంగా పారిశ్రామిక వ్యర్థాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు ఆదేశాల మేరకు ఎంపీడీఓ పి.రవికుమార్, డిప్యూటీ ఎంపీడీఓ అల్లు భాస్కరరావు, పంచాయతీ సెక్రటరీలు ఎం. బూర్జివలస, పణుకువలస గ్రామాల్లో పర్యటించారు. వాస్తవ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల నుంచి నేరుగా మంచినీటి చెరువుల్లోకి కాలువల గుండా విడిచిపెడుతున్న రసాయనిక వ్యర్థాలను చూసి ఎంపీడీఓ రవికుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా బాహ్య ప్రపంచానికి తెలియకపోవడం విచారకరమన్నారు. రసాయనాలను, ఘన వ్యర్థాలను విడిచిపెడుతున్న పరిశ్రమలకు నోటీసులివ్వాలని సెక్రటరీలకు ఆదేశాలిచ్చారు. ఏపీఐఐసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్టులకు ఇక్కడి వాస్తవ వివరాలను నివేదిక రూపంలో అందజేస్తామని వెల్లడించారు.
పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు


