హు..హు..హు..హు..!
వణికిస్తున్న చలి
కమ్మేస్తున్న పొగమంచు
ఉదయం 9గంటలవరకు బయటికి రాలేని పరిస్థితి
15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
అవస్థలు పడుతున్న వాహనదారులు, మార్నింగ్ వాకర్స్
చలిలో తిరగకూడదంటున్న వైద్యులు
సైనసైటిస్, ఆస్తమా వంటి వ్యాధుల తీవ్రత పెరిగే ఆస్కారం
విజయనగరం ఫోర్ట్:
జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దుప్పట్లు, రగ్గులు ఏవీ కూడా చలి నుంచి రక్షణ అంతగా ఇవ్వడం లేదు. మైదాన ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతాలైన మెంటాడ, ఎస్.కోట, గంట్యాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో చలి తీవ్రత చాలా ఉంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉద యం పూట విధులు నిర్వర్తించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పేప ర్ బాయ్స్, ఉదయం 7 గంటలకు వివిధ కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులకు అవస్థలు తప్ప డం లేదు. మంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాలపై ప్రయాణించేవారికి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాహనాలను అత్యంత అప్రమత్తంగా నడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కూడా వాహనాలను గమనిస్తూ ఉండాలి.
అవస్థలు పడుతున్న వృద్ధులు, పిల్లలు
చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని వర్గాల ప్ర జలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఆస్తమా, సైనసైటిస్, సీఓపీడీ, నిమోనియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి తీవ్రత మరింత పెరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. చలితీవ్రత బారిన పడకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చలికాలంలో చర్మ వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉన్ని స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు, జర్కిన్‌లు వంటివి ధరిస్తున్నారు. కొంతమంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
హు..హు..హు..హు..!


