లేబర్ కోడ్‌లపై సమరం
విజయనగరం గంటస్తంభం: సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ విజయనగరం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల మీదగా గంటస్తంభం వర కు సాగిన ఈ ర్యాలీలో మహిళా కార్మికులు, నాయకులు ఎర్రచీరలు, ఎర్ర బనియన్లు ధరించి పాల్గొన్నారు. ముందు భాగంలో మహిళలు కోలాటం ప్రదర్శిస్తూ ర్యాలీకి ఆకర్షణగా నిలిచారు. ర్యాలీని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టీవీ రమణ మాట్లాడుతూ, డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి గా సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్‌లపై విస్తృతంగా చర్చ జరగనుందన్నారు.
కట్టు బానిసలుగా కార్మికులు
అనేక పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల ను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను హరించారని విమర్శించారు. పనిగంట లు పెంచడం, కనీస వేతనాలు అమలు కాకుండా చేయడం, మహిళా కార్మికులను రాత్రి పనుల్లోకి నెట్టడం ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నాయకత్వం వహిస్తున్న రెండు వేల మంది కార్మిక సంఘాల నాయకులు ఈ మహాసభల్లో పాల్గొంటా రని తెలిపారు. ఐదు దేశాల నుంచి కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. మహాసభల చివరి రోజు జనవరి 4న విశాఖపట్నంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రామిక ఉత్సవాలు ప్రారంభమయ్యామని, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీలక్ష్మి, ఎ.జగన్మోహన్‌రావు, బి.రమణ, పి.రమణమ్మ, సుధారాణి పాల్గొన్నారు.


