
వ్యవసాయం కంటే పింఛన్ ఆదాయమే ఎక్కువ
దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామస్తులకు వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయం కంటే పింఛన్ రూపంలో వచ్చిన ఆదాయమే అధికమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వరి పండిస్తే ఎంత ఆదాయం వస్తుందంటూ వ్యవసాయ సిబ్బందిని తిరిగి ప్రశ్నించారు. సాగు వివరాలపై ఆరా తీశారు. దత్తిలో బుధవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేది కలో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంద రూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, తన ఒక్కడివల్ల కాదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని, కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంలో రూ.లక్షా50వేలతో ఏర్పా టు చేసుకున్న దుకాణాన్ని ఇటీవల తొలగించడంతో రోడ్డున పడ్డానని, ఆదుకోవాలంటూ దత్తి గ్రామానికి చెందిన పి.ధనుంజయ్ అనే యువకుడు సీఎంను వేడుకున్నారు. దీనిపై చంద్రబాబు స్పంది స్తూ ఉపాధి కల్పనతో పాటు దుకాణం అప్పగించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 12 గంటలకు వచ్చిన సీఎం సాయంత్రం 4.30 గంటల వరకు దత్తిలోనే ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జు న, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజుపాల్గొన్నారు.