
గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?
● డీఎంహెచ్‌వోను అడ్డుకున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు
● గురుకుల పాఠశాల ముందు ఆందోళన
కురుపాం: గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే మీకు అంత నిర్లక్ష్యమా..! ప్రాణాలు పోతున్నా స్పందించరా..? వసతిగృహంలో అసలేం జరుగుతుంది.. కొన్న రోజులుగా విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నా ఇలాగేనా.. స్పందిస్తారా... మీ పిల్లలు అనారోగ్యం బారిన పడితే ఇలాగే స్పందిస్తారా? అంటూ.. కురుపాం గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఐటీడీఏ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణకు శుక్రవారం వచ్చిన డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావును వారు అడ్డుకున్నారు. పిల్లలు అనారోగ్యం, మరణాలపై పూర్తి సమాచారం ఇస్తేనే లోపలికి వెళ్లాలని ఐటీడీఏ అధికారుల తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం సాలూరు, పార్వతీపురం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం తదితర దూర ప్రాంతాల నుంచి గురుకుల పాఠశాలలో చేర్పిస్తే తిరిగి అనారోగ్యంతో తమ పిల్లలను అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అనారోగ్యం బారిన పడి ఎంతకీ తగ్గకపోవడంతోనే తాము తమ పిల్లలను వెంట తీసుకొని వెళ్తున్నామని సరైన వైద్యం, పర్యవేక్షణ ఉంటే ఎందుకు తీసుకువెళ్తామని ప్రశ్నించారు. విద్యార్థులు సెలవులకు వెళ్లిన తరువాతే అనారోగ్యం బారిన పడ్డారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.