
పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..!
అవగాహన కల్పిస్తున్నాం...
ఐసీడీఎస్ పరిధిలో 239 మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నెల రోజులు పాటు నిర్వహించే రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో గర్భిణులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సమతుల్యమైన ఆహారాన్ని అందించాలని చెబుతున్నాం. పిల్లలకు బయట ఆహారం కాకుండా ఇంటి వద్దే తయారు చేసి పెట్టాలని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం.
– టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్
విజయనగరం ఫోర్ట్: బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీ, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడానికి ప్రస్తుతం ఉన్న పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని పిల్లలు ఏది అడిగితే అది తల్లిదండ్రులు కొని ఇచ్చేస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దవారు కూడా జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఫలితంగా పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ఊబకాయం రావడం వల్ల పిల్లలు అనేక వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. ఇటీవల చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. మరి కొంతమంది షుగర్, బీపీ, గుండె జబ్బులు బారిన పడుతున్నారు.
ఊబకాయంతో ఆపసోపాలు
చిన్న వయసులోనే ఊబకాయం రావడంతో పిల్లలు ఆపసోపాలు పడుతున్నారు. చిన్నపాటి పరుగు తీసినా అలసిపోవడం, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు. జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలు ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. గతంలో పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పిండి వంటలు పెట్టేవారు. నువ్వు ఉండలు, వేరుశనగ ఉండలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండేవి పెట్టేవారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా పెట్టేవారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారు. దీనికి తోడు పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడుకునే వారు. దీంతో ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పడు పిల్లల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పిల్లల్లో శారీరక శ్రమ ఉండడం లేదు. మొబైల్ ఫోన్లుకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారు ఊబకాయం బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు నిల్వలు ఉండడం వల్ల ఊబకాయం వస్తుంది. ఉండాల్సిన బరువు కంటే పిల్లలు ఎక్కువ బరువు ఉంటారు. శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ కేలరీలను ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అధిక కొవ్వులు, స్వీట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి.
ఉబకాయం వల్ల వచ్చే అనర్ధాలు
ఊబకాయం ఉన్న వాళ్లు మెట్లు ఎక్కడానికి, నడవడం వంటివి చేసినా కూడా ఊపిరి అందక ఇబ్బంది పడతారు. శరీరం అధిక బరువును మోయడానికి ఎక్కువ శక్తిని వినియోగించడం వల్ల తరుచుగా అలసటగా అనిపించడం, సాధారణ పనులు చేయడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తుంది. అధిక శరీర బరువు మోకాళ్లు తుంటి పాదాలు, వెన్నెముక వంటి వాటిపై అసాధారణ ఒత్తిడిని కల్గిస్తుంది. దీని వల్ల కీళ్లు అరుగుదలకు దారి తీసి తీవ్రమైన నొప్పులకు కారణమవుతుంది. చర్మం మడతలలో మెడ, గజ్జలు, చంకలు తేమ పేరుకు పోయి దద్దుర్లు, దురద, ఇన్‌ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు తరచుగా వస్తాయి. ఊబకాయం వల్ల మధుమేహాం, గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ పొర, కిడ్నీ, కాలేయ కేన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది.
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో..
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఉన్నారు. భోగాపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, వియ్యంపేట, ఎస్.కోట, బాడంగి, గంట్యాడ, గజపతినగరం, గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి
ఊబకాయం బారిన పడకుండా పండ్లు, కూరగాయాలు, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్స్, కొవ్వు, నూనె పదార్ధాలు తగ్గించాలి. పానీపూరీ, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు తినకూడదు. ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. రోజులో కనీసం 30 నుంచి 60 నివిషాలు వ్యాయామం చేయాలి.
ఊబకాయం వల్ల వ్యాధులు బారిన పడే అవకాశం
తక్కువ వయసులో బీపీ, షుగర్ గుండెపోటుకు గురయ్యే అవకాశం
అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు
పెద్దవారిలోనూ అదే పరిస్థితి

పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..!

పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..!