
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్
సాలూరు: రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగంలో అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, ప్రజలకు రక్షణగా, అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పట్టణంలోని తన స్వగృహం వద్ద పార్టీ నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, నాటి ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అక్రమ కేసులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న ప్రభుత్వ పెద్దల తీరు మారడం లేదన్నారు. బాధితులు డిజిటల్ బుక్‌లో తగు ఆధారాలతో నమోదు చేయాలన్నారు. అటువంటి వారి వివరాలను డిజిటల్ బుక్ డేటా బేస్‌లో భద్రపరచడం జరుగుతుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురవుతున్న ప్రతీ ఒక్కరికి డిజిటల్ బుక్‌తో అండగా ఉంటామన్నారు. రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో తాను ఏనాడూ ఏ అధికారిని చట్ట వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పలేదని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలా మాట్లాడుతున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ కార్యదర్శి, మక్కువ జెడ్పీటీసీ మావుడి శ్రీనువాసులనాయుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర