
సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
బొబ్బిలి: సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశీలకులు ఎంవీ రమణ, తిరుపతిరావుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎమ్మెల్యే బేబీనాయన, ఐ.విజయకుమార్, కోశాధికారిగా ఎన్.వెంకటి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా సుంకరి సాయిరమేష్‌లను ఎన్నుకున్నారు.
డివైడర్‌ను ఢీకొని
భార్యాభర్తలకు గాయాలు
భోగాపురం: మండలంలోని పోలిపల్లి జాతీయ రహదారిపై డివైడర్‌ను బైక్‌తో ఢీకొన్న భార్యాభర్తలు గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన భార్యాభర్తలు బైక్‌పై విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో పోలిపల్లి చేరుకుసరికి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న భర్తకు తీవ్రగాయాలు కాగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో విజయనగరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ర్యాలీ
విజయనగరం టౌన్: బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా బుధవారం సంస్ధ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ సంస్ధలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్ధ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సంస్ధ డీజీఎం దాలినాయుడు మాట్లాడుతూ హుద్‌హుద్ వంటి తుఫాన్‌లు, విపత్కర పరిస్ధితుల్లో కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే అందరికీ అందుబాటులో నిలిచి అందరి మన్ననలు పొందిందన్నారు. 25 ఏళ్ల ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా ఫోర్‌జీ నెట్‌వర్క్, 100జీబీ స్పీడ్‌తో ఇంటర్‌నెట్ సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం కొత్తగా టవర్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రారంభించి టీటీడీ కల్యాణ మంటపం, లయన్స్ క్లబ్, కోట జంక్షన్, గురజాడ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి కార్యాలయానికి ర్యాలీ చేరింది.

సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు