
పండగపూట పిల్ల చేష్టలు!
సాక్షిప్రతినిధి, విజయనగరం:
నడిమంత్రపు సిరి వచ్చినమ్మ చింతకాయలు చూసి ఇవేంటి.. వంకరటింకరగా ఉన్నాయి అన్నదట... కిమిడి నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది.. రాకరాక డీసీసీబీ చైర్మన్ పదవి వచ్చేసరికి దానిని ఏకంగా శాసనమండలి విపక్షనేత మీదకే ప్రయోగిస్తున్నారు. విజయనగరం పట్టణంలో కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని సిరిమాను పండక్కి కొత్త భాష్యం చెబుతున్నారు. వాస్తవానికి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఊరేగింపును టీడీపీ నేతలు.. అధికారులు, న్యాయాధికారులు కోట మీదనుంచి దర్శించుకుని ప్రణమిల్లుతారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. కార్యకర్తలు మాత్రం సిరిమాను సాగే రోడ్డులో ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణం నుంచి సిరిమానును దర్శించుకుంటున్నారు. ఇన్నేళ్లలో ఈ వాజీబును ఎవరూ కాదనలేదు. సత్తిబాబు ఇక్కడ ఎందుకు అని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా ఇదొక సర్దుబాటు రూపంలో కొనసాగుతూ వస్తోంది. టీడీపీ నాయకులూ.. విజయనగరం సంస్థానం కుటుంబీకులు కోట మీదనుంచి.. బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు.. కుటుంబీకులందరూ డీసీసీబీ నుంచి సిరిమానును తిలకిస్తూ వస్తున్నారు. ఇక సాధారణ జనం అయితే వీధుల్లో.. మేడలు .. మిద్దెల మీద నుంచి సిరిమానును దర్శించుకుంటూ వస్తున్నారు.
బొత్సకు డీసీసీబీ వేదికపై నో చాన్స్
ఇంకెక్కడైనా కూర్చోండి..
ఏళ్లనాటి ఆనవాయితీకి ఆటంకం
బాబు దృష్టిలో పడేందుకు నాగార్జున తాపత్రయం
తమవాళ్లు వస్తారంటూ కొత్తభాష్యం
ఇదెక్కడి తీరు...
గత పాతికేళ్లలో తొలిసారిగా ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాత్రం.. ఠాట్ బొత్స సత్యనారాయణ ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు.. మా సహకార సంఘాల డైరెక్టర్లు 94 మంది ఉన్నారు.. వాళ్లంతా ఇక్కడికే వచ్చి ఈ ప్రాంగణంలో కూర్చుని సిరిమాను యాత్రను వీక్షిస్తారు.. బొత్స అక్కడ కూర్చునేందుకు వీలు లేదంటే లేదంటూ హూంకరించారు. నాగార్జున.. ఆయన డైరెక్టర్లు కావాలనుకుంటే టీడీపీ నాయకులతో కలిసి కోటమీద నుంచి సిరిమానును చూడచ్చు కానీ.. కేవలం బొత్సను ఇబ్బంది పెట్టాను.. అడ్డుకున్నాను అని ఆ పార్టీ అధిష్టానం వద్ద చెప్పుకోవడం కోసమే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు. కేవలం చంద్రబాబు దష్టిలో పడడానికి ఇలా చేశారని.. లేకపోతే ఒక పూట సిరిమాను చూసేందుకు కూడా వేదిక ఇవ్వడానికి ఇన్ని మాటలు ఎందుకు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నాగార్జునలోని రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా బొత్స సత్యనారాయణకు శాసన మండలి విపక్ష నేతగా ప్రభుత్వం ప్రాధాన్యతను.. సముచితమైన ప్రోటోకాల్‌ను కూడా కల్పించాల్సి ఉంది.. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.