
7 క్రీడాంశాలు.. 1500 మంది క్రీడాకారులు
ఆటలాడుతున్న క్రీడాకారులు(ఫైల్)
విజయనగరం:
ఏడాదికోసారి నిర్వహించే విజయనగరం ఉత్సవాల్లో భాగంగా క్రీడోత్సవాల నిర్వహణకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 5,6 తేదీల్లో నగర శివారులోని విజ్జీ స్టేడియం వేదికగా క్రీడాపోటీలు జరగనున్నాయి. మొత్తం 7 క్రీడాంశాల్లో నిర్వహించే పోటీల్లో 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.7.50 లక్షల వ్యయంతో నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి 6వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు.
పోటీల నిర్వహణ ఇలా...
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో తలపడేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పురుష జట్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. టెన్నీస్ క్రీడాంశంలో ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు నిర్వహించనుండగా.. చెస్, టెన్నీస్ క్రీడాంశాల్లో 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాల, బాలికలకు పోటీలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోటీలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్జీ స్టేడియంలో ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా ప్రారంభించనుండగా.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పోటీలు జరగనున్నాయి. రెండవ రోజు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోటీలు నిర్వహించిన అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఆయా క్రీడా అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు పర్యవేక్షించే వ్యాయామ ఉపాధ్యాయులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని, విజయవంతం చేయాలని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి
కె.శ్రీధర్‌రావు తెలిపారు.
ఈ నెల 5,6 తేదీల్లో విజ్జీ స్టేడియం వేదికగా క్రీడోత్సవాలు
టెన్నీస్‌లో ఉత్తరాంధ్ర స్థాయి పోటీలు
మిగిలిన క్రీడాంశాల్లో ఉమ్మడి
విజయనగరం జిల్లా స్థాయి పోటీలు
రూ.7.50 లక్షలతో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు