
నిబంధనలకు గండి..!
హౌసింగ్ విభాగంలో..
● నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
● అడ్డదారిలో పెద్దకుర్చీని కాజేసిన ఉద్యోగి
● ఇటుక ఇటుక్కీ ఒక్కో రేటు
సాక్షిప్రతినిధి విజయనగరం:
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు కావాల్సినవి మన విస్తర్లోకి వచ్చి వాలతాయని విజయనగరం హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు రుజువు చేస్తున్నారు. అసలే గృహనిర్మాణ సంస్థ.. ఇల్లుకట్టినంత శ్రద్ధగా... పునాదులు వేసినంత దృఢంగా.. రంగులు అద్దినంత అందంగా తన దందా నడిపించుకున్న ఓ ఉన్నతాధికారి.. ఏకంగా రెండు ఇన్‌చార్జి పోస్టుల్లో కొనసాగుతూ ప్రభుత్వ నిబంధనలకు ‘గండి’కొడుతుండడం ఆ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. తనకన్నా సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నా వాళ్లను వెనక్కినెట్టేసి తన పలుకుబడితో పెద్ద కుర్చీలో కూర్చొని తన పవర్ చూపించిన ఈ పెద్దాఫీసర్ ఇక తనకు ఎదురులేదని ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా హౌసింగ్ కార్పొరేషన్‌లో రిక్రూట్మెంట్ లేకపోయినా అడ్డదారిలో ఒక వర్క్ ఇన్‌స్పెర్‌ను వేసుకుని, వెనువెంటనే ఆయనకు ఏకంగా మండల ఇన్‌చార్జి హోదా (హోసింగ్ ఏఈ హోదా) కట్టబెట్టి మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ప్రభుత్వ వ్యవస్థలకు సవాల్ విసురుతుండడం ఉద్యోగవర్గాలనే కలవరపెడుతోంది.
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ...
ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ఆయనకు వాస్తవంగా పీడీ పోస్టు రాదు. కానీ ఎలాగైనా ఆ పెద్ద కుర్చీ కావాలి. కాబట్టి నిబంధనలకు ‘గండి’కొడుతూ బేరం సెటిల్ చేసుకుని ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా నియమితులైనట్టు సమాచారం. ఇక అడ్డు తొలగిపోయింది. ఇన్‌చార్జి ఈఈ కాబట్టి.. పీడీ పోస్ట్ ఇచ్చేయొచ్చు అనే లాజిక్ తీసి పీడీ పోస్టు కొట్టేశారు. వాస్తవానికి సీనియారిటీ లిస్టులో ఈయనకన్నా ఆరుగురు సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) పైన ఉండగా వాళ్లను పక్కకునెట్టేసి ఇన్‌చార్జి ఈఈగా, పీడీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘కోట’లో డీఈఈగా ఉంటూ విద్యలనగరంలో ఈఈగా, హౌసింగ్ పీడీగా దర్జా వెలగబెడుతున్నారు. చీపురుపల్లిలో ఉన్న ఎన్.జె.రత్నాకర్, విజయనగరంలో పనిచేస్తున్న జి.వి.రంగారావు ఆయనకన్నా సీనియర్లు. కానీ వాళ్లను తొక్కుకుంటూ ఈయన ముందుకెళ్లిపోయారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా హౌసింగ్ కార్పొరేషన్‌లో నియామకాలు చేపట్టలేదు. కానీ ఈయన తన పలుకుబడితో తనకు నచ్చిన వ్యక్తిని గత జనవరిలో విజయనగరంలో అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించుకున్నారు. కుర్రాడు జూనియర్ కాబట్టి అలా ఉద్యోగంలో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు అనుకుంటే నాలుగురోజుల్లోనే హౌసింగ్ పథకానికి సంబంధించి ఏకంగా మండల ఇన్‌చార్జి హోదా కట్టబెట్టేశారు. అదేంటి మండలంలో ఇంకా సీనియర్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు కదా అంటే.. వాళ్లెవరూ పీడీకి దగ్గర కాదుగా.. అందుకే ఆయనను ఏకంగా ఏఈ హోదాలో మండల ఇన్‌చార్జిగా నియమించారు అనే సమాధానం ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. అడ్డదారిలో నిబంధనలకు ‘గండి’ కొడుతూ వచ్చిన ’పీడీ’ హవాపై ఇప్పుడు జిల్లా హౌసింగ్ శాఖలో చర్చజోరందుకుంది.
ఆయనదంతా అడ్డ అడ్డదారి!
హౌసింగ్ కార్పొరేషన్లోకి అడుగుపెట్టేందుకు అడ్డదారి చేసుకున్న ఆ అధికారి ఇక ప్రతిదీ అడ్డంగా చేసుకుంటూ.. అడ్డొచ్చినవాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా కార్పొరేషన్లో చేరిన ఆయన సర్వీస్ మొత్తం నెల్లిమర్లలోనే పనిచేశారు. డీఈఈగా ఉన్న సమయంలో అంటే మార్చి నెలాఖరున అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడు రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్‌కు ముందే అప్పటి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు హౌసింగ్ ఇన్‌చార్జి పీడీగా నియమించాలని కలెక్టర్ తలపోసి ఒక ఫైల్ రెడీ చేశారు. అయితే, వ్యవస్థలో అడ్డదారులన్నీ తెలిసిన సదరు ఉద్యోగి ఉన్నతాధికారుల వద్ద ‘మురళీ’నాథం వినిపిస్తూ తనకు అనుకూలంగా పీడీ పోస్టును తెచ్చుకున్నారు. వాస్తవానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు మాత్రమే ఆ పీడీ పోస్టు ఇవ్వాల్సి ఉంది.

నిబంధనలకు గండి..!

నిబంధనలకు గండి..!