
నోటిఫికేషన్ ఇచ్చారు.. పోస్టుల భర్తీ మరిచారు..!
విజయనగరంఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి సర్కార్... నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎంతో ఆశగా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే... భర్తీ నిలిపివేయడం ఏమిటని నిలదీస్తున్నారు.
మార్చి 13న నోటిఫికేషన్...
ఈ ఏడాది మార్చి 13వ తేదీన వైద్య విధాన్ పరిధిలోని ఆస్పత్రుల్లో 29 పోస్టుల భర్తీకి వైద్య విధాన్ పరిషత్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. బయోస్టాటిస్టిషయన్ పోస్టు–1, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు –2, ఆడియో మెట్రిసిన్ పోస్టులు–4, రేడియాగ్రాఫర్–1, ఫిజియోథెరపిస్టు పోస్టులు–2, బయో మెడికల్ ఇంజినీర్ పోస్టు–1, ధియేటర్ అసిస్టెంట్ పోస్టులు–3, మెడికల్ రికార్డు అసిస్టెంట్ పోస్టు–1, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు–2, ఎలక్ట్రీషియన్ పోస్టు–1, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు–10, ప్లంబర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 15 పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. 14 పోస్టులు భర్తీ చేయలేదు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టులు భర్తీ చేయకపోవడంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
29 పోస్టులకు ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చాం. వీటిలో మొదటి కౌన్సెలింగ్‌లో 10 పోస్టులు, రెండో కౌన్సెలింగ్‌లో ఐదు పోస్టులను భర్తీచేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిపోస్టుల భర్తీని నిలిపివేశాం.
– డాక్టర్ పద్మశ్రీ రాణి,
జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి

నోటిఫికేషన్ ఇచ్చారు.. పోస్టుల భర్తీ మరిచారు..!