
ఐటీఐ స్థలం జోలికొస్తే ఊరుకోం
● ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
● స్థలం చదునుచేసేవారిపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్
బొబ్బిలి:
పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఊరుకునేది లేదని విద్యార్థులు హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి. రవికుమార్, డివిజన్ కార్యదర్శి వి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఐటీఐకి చెందిన స్థలంలో హోటళ్లు, రెస్టారెంట్లు పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బీజేపీ ఇన్‌చార్జి మరిశర్ల రామారావు ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి పొందినట్టు తెలిసిందన్నారు. స్థలం ఐటీఐ నుంచి చేజారనీయమని, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్థలాన్ని చదును చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగరాజు,సురేష్, చరణ్,ప్రదీప్, ఐటీఐ, ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
● ఇదీ పరిస్థితి...
విశాఖపట్నం–రాయగడ అంతరరాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఐటీఐకు సుమారు ఎకరన్నర స్థలం ఉంది. ఇది ఎంతో విలువైనది. కొన్నేళ్ల కిందట ఏపీ టూరిజం సంస్థకు ఐటీఐ ద్వారా అప్పటి ప్రభుత్వం వీణలతయారీ, విక్రయ కేంద్రం కోసం కేటాయించినా ఎలాంటి పనులు జరగలేదు. ప్రైవేటు వ్యక్తులు కొన్నాళ్లు ఆ స్థలాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఓ నాయకుడికి 20 ఏళ్లకు లీజుకు ఇచ్చిందన్న సమాచారంతో ఐటీఐ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థలం చదును చేసినా మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి తెలియకపోవడం విచారకరం. స్థానికుల ఆందోళనతో రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.