
బదిలీ కలెక్టర్‌కు సన్మానం
విజయనగరం అర్బన్: బదిలీ అయిన కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు జిల్లా అధికారులు శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఘనంగా సన్మానించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయన సారథ్యంలో పనిచేసి సాధించిన విజయాలను గుర్తుచేశారు. దుశ్శాలువలతో సత్కరించారు.
ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ కార్యక్రమం?
సాక్షిప్రతినిధి విజయనగరం: ప్రభుత్వ కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం మార్కెట్ కమిటీ ఆవరణలో గాజులరేగ ప్రాథమిక సహకార పరపతి సంఘం కొత్త పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు చేపట్టింది. ఈ సంఘానికి కోరాడ వెంకటరావు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అది పూర్తిగా అధికారిక కార్యక్రమం. దీనికి సహకారశాఖ అధికారి వి.సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే అదితిగజపతి రాజు కూడా హాజరై కొత్త పాలకవర్గాన్ని అభినందించారు. అక్కడివరకు ఫరవాలేదు. అయితే, ఎలాగూ టెంట్లు.. పూల దండలు.. బొకేలు ఉన్నాయి.. మళ్లీ కొత్తగా అవన్నీ సమకూర్చడం ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆరోవార్డు నుంచి టీడీపీలో చేరుతున్నాం అంటూ వచ్చిన పలువురికి అక్కడే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమం ఎందుకు పెట్టడం.. అదేదో పార్టీ ఆఫీసులోనో.. ఎమ్మెల్యే ఇంటివద్దనో పెడితే బాగుణ్ణు కదా అని కొందరు అక్కడే గుసగుసలాడగా.. పల్లకోండిరా.. అక్కడైతే సింపుల్‌గా అయిపోద్ది.. ఇప్పుడు చూడు.. దండలు.. డెకరేషన్లు.. అన్నీ మనకోసమే చేసినట్లుగా లేవూ.. అంటూ నోరు మూయించారు.
కొలిక్కి వచ్చిన భూ సమస్య
వీరఘట్టం: మండలంలోని చినగోర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 17లో ఉన్న 20 ఎకరాల భూ సమస్యకు శుక్రవారం రెవెన్యూ, పోలీస్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. ఆక్రమణకు గురైన సుమారు 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలం చినగోర రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 17లో ఉన్న 151 ఎకరాల భూమిని 18 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వీరఘట్టం మండలం సంతనర్సిపురంలో ఉన్న భూమిలేని పేదలకు ఎకరా చొప్పున కేటాయించింది. అందరికీ డీ పట్టాలు ఇచ్చింది. అయితే, భూమి అప్పగించలేదు. చినగోర రెవెన్యూ గ్రామానికి పక్కనే ఉన్న జియ్యమ్మమవలస మండలం గడసింగుపురం, ఏనుగులగూడకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిలో సుమారు 20 ఎకరాలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ భూమిపై హక్కు కల్పించాలని జియ్యమ్మవలస మండలాలనికి చెందిన వారు కూడా అధికారులపై ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో సంత–నర్శిపురం లబ్ధిదారులకు, భూము లు సాగు చేస్తున్న జియ్యమ్మవలస మండలానికి చెందిన వారికి కొన్నేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. పోలీసు కేసులు కూడా నమోదయ్యా యి. ఆ భూమిని వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల తహసీల్దార్లు ఎ.ఎస్.కామేశ్వరరావు వై.జయలక్ష్మి, సర్వే అధికారులు పరిశీలించారు. 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలంలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టంచేశారు.