● ప్రత్యేక అలంకరణలో పైడితల్లి
● చదురుగుడి, వనంగుడిల వద్ద
పందిరిరాట
● మండల దీక్షలు చేపట్టిన భక్తులు
చదురుగుడి వద్ద పందిరిరాట ఉత్సవం
విజయనగరం టౌన్:
సిరులతల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పందిరిరాటతో శుక్రవారం శ్రీకారంచుట్టారు. ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష నేతృత్వంలో వేకువజామునుంచి అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముహూర్తం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి వద్ద, ఉదయం 10.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి వద్ద పందిరిరాట ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదురుగుడి వద్ద నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆమెకు అర్చకులు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పైడితల్లి ఆలయ విస్తరణ పనులను ఈ ఏడాది పండగ పూర్తయిన తర్వాత రూ.కోటి 80లక్షల ఖర్చుతో పూర్తిచేస్తామన్నారు. అమ్మవారి పండగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. పందిరిరాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ పూజారులు, అధికారులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం
పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం రోజున ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష ఆధ్వర్యంలో అమ్మవారి దీక్షాపరులు మండల దీక్షలను సన్నిధానంలో తీసుకున్నారు. దీక్షధారులకు దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. కార్యక్రమంలో పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో, ఎస్.అచ్చిరెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
సిరులతల్లి ఉత్సవానికి శ్రీకారం
సిరులతల్లి ఉత్సవానికి శ్రీకారం