
పెట్రోల్‌లో నీరు..
● పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన
● పోలీస్ స్టేషన్‌కు వివాదం
చీపురుపల్లి: ఆంజనేయపురానికి చెందిన తమ్మిన వెంకటేష్... చీపురుపల్లి మెయిన్‌రోడ్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో రూ. 510 పెట్రోల్‌ను తన ద్విచక్ర వాహనంలో పోయించాడు. బంక్ నుంచి కొద్ది దూరం వెళ్లేలోగా రెండు సార్లు ద్విచక్ర వాహనం మొరాయించింది. అనుమానం వచ్చి తిరిగి పెట్రోల్ బంక్‌కు వచ్చి సిబ్బందికి చెప్పాడు. అక్కడే వాహనం నిలిపి పెట్రోల్ ట్యాంక్ నుంచి ఓ బాటిల్‌లోకి పెట్రోల్‌ను తీశాడు. పెట్రోల్‌తో పాటు నీరు కనిపించడంతో ఆందోళన వ్యక్తంచేశాడు. ఇంతలో కిశోర్ అనే ఆటో డ్రైవర్ వచ్చి తనకు కూడా అనుమానం ఉందని, డీజిల్ కల్తీ అవుతోందని పేర్కొన్నాడు. అక్కడికక్కడే ఓ బాటిల్ లీటర్ డీజిల్ పోయించి చూస్తే తెలుపు రంగులో డీజిల్ కనిపించింది. దీంతో అధిక సంఖ్యలో వినియోగదారులు చేరి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది పెట్రోల్ బంక్‌కు వచ్చి అక్కడ సిబ్బందిని, వినియోగదారులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నీరుకలిసిన పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడంపై యువకులు మండిపడ్డారు. వాహనాలు మరమ్మతులకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని నిలదీశారు.