
పైడితల్లి పండగకు నేడు పందిరిరాట
● వనంగుడి, చదురుగుడిల వద్ద ప్రత్యేక పూజలు
● మండల దీక్షలు ప్రారంభం
విజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు శుక్రవారం పందిరి రాట మహోత్సవంతో అర్చకులు, ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు. చదురుగుడి, వనంగుడి వద్ద పందిరిరాట వేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను భక్తులు స్వీకరించనున్నారు. ఈ అపురూపమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు తరలిరానున్నారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆలయ ఆవరణలో భాద్రపద బహుళ పంచమిని పురస్కరించుకుని ఉదయం మండల దీక్షలు ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పందిరి రాట వేయనున్నారు. వనంగుడి వద్ద 11 గంటలకు ముహూర్తం ప్రకారం పందిరి రాట, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూజా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబర్ 6న సోమవారం తొలేళ్ల మహోత్సవం, అక్టోబర్ 7న మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేదిశాగా సాగుతున్నామన్నారు. అక్టోబర్ 14న మంగళవారం తెప్పోత్సవం, 19న ఆదివారం కలశ జ్యోతి ఊరేగింపు, 21న ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. చండీహోమం, పూర్ణాహుతితో ఉత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ప్రతీరోజూ పర్వదినమేనని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.