ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా.. కల్లుగీత కార్మికుల కష్టాలు తెలిసొచ్చేలా.. కనిపిస్తున్న ఈ చిత్రం విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్డులో గురువారం సాయం సంధ్యా సమయాన సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో గీత కార్మికుడు తన బతుకు జీవనానికి బాటలు వేసుకునేలా.. ఈ దృశ్యం చూపరులను ఇట్టే కట్టి పడేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం నిరసన గళం వినిపించారు. 2019లో విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చినా నేటికీ సొంత భవనం లేకపోవడంపై విద్యార్థులు నినదించారు. ఇక్కడ కళాశాలలో ఏటా 400 మందికి పైగా విద్యార్థులు కళాశాలలో చేరుతున్నా సొంత భవనం ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికీ సంస్కృత డిగ్రీ కళాశాలలోనే క్లాసులు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి కె.రాజు, అధ్యక్షుడు జి.సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం