సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాగు బాట

- - Sakshi

పూసపాటిరేగ: సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడిన పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన యువ ఇంజినీర్‌ పోతినిండి అనంతబాబు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత ఊరిలో వ్యవసాయం చేస్తూ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా ధాన్యంతో పాటు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు సైతం సేంద్రియ సాగుతో చేసిన ఉత్పత్తులును ప్రోత్సహించడంతో ఆయా పంటలకు బాగా గిరాకీ పెరిగింది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించిన పంటలను తమ ఇంటి వద్ద నుంచే ఆరోగ్యసమస్యలున్న వారికి నామమాత్రపు ధరకే ఆయన విక్రయిస్తున్నారు. ప్రకృతిసాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో గ్రామాల్లో ప్రకృతిసాగుపై రైతులకు ఆసక్తి పెరిగింది.

అరుదైన వంగడాల సాగు
ప్రకృతి సాగులో వరి రకంలో కుంకంసాలు, ఒడిశా బాసుమతి, కాలాబట్టి, నవారా రకం వరిని అనంతబాబు సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ సాధారణ సాగులో పంటకాలం 120 రోజులు కాగా ఈ అరుదైన రకం సాగుకు 150 రోజుల సమయం పడుతుంది. ఆయన తెలిపారు. ఆయా సాగులో పంటకోత ప్రయోగం చేయగా ఎకరాకు 20 నుంచి 25 బస్తాలు వరకు దిగుబడి వస్తున్నట్లు చెప్పారు. 10 ఎకరాల్లో వరితో పాటు ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. సేంద్రియసాగు ద్వారా పండించిన వరిని వినియోగిస్తే వ్యాధులు దూరమవుతాని, అలాగే బీపీ, సుగర్‌, ఆస్తమా వంటి వ్యాధులు నయమవుతాయని చెప్పారు. పురాతన రకాలైన వరికి మార్కెట్లో బాగా గిరాకి ఉన్నట్లు తెలియజేశారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top