ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం.. | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..

Dec 18 2025 7:20 AM | Updated on Dec 18 2025 7:20 AM

ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..

ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..

సాక్షిప్రతినిధి, విజయనగరం:

మయ్యా ఆఫీసర్లు.. నేను చెబితే వినరా..? ఏం.. నాకేం తక్కువ.. నాకు పవర్‌ లేదా..? నేను మీ అమ్మగారికే అయ్యగార్ని.. అంటే నేనే ఎక్కువ పవర్‌ ఫుల్‌.. కాబట్టి నేను చెప్పేది టకటకా నోట్‌ చేసుకుని ఫటఫటా చేసేయాలి. నేను వద్దన్న చోట ఉపాధి హామీ పనులు గట్రా శాంక్షన్‌ ఇవ్వకండి.. అంతా మనం చెప్పినట్లే అవ్వాలి.. మనం చెప్పినవాళ్లకే ఇవ్వాలి. ఇదీ ఆయనగారి దాదాగిరి. మళ్లీ గెలుస్తామో లేదో.. ఇప్పుడే ఎంతైనా పవర్‌ చూపేయాలి.. అనే ఆతృతతో అసంబద్ధంగా ఇష్టానుసారం అధికారులపై స్వారీ చేస్తున్నారు. ఈయన తొందర.. తుత్తర వ్యవహారంతో భరించలేని అధికారులు ‘ఆయనకు తెలియదు.. చెబితే వినడు.. ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా సెలవుపై పోవడం’ మేలు అంటూ ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకుంటున్నారట.

నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 105 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతోల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో మండలానికి రూ.20 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. పంచాయతీలు తీర్మానం చేసుకుని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. చాన్నాళ్లకు నిధులు రావడంతో పల్లె ప్రజల అవసరాలు తీర్చేలా సర్పంచులు, ఎంపీటీసీలు సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ నిర్మాణాలు వంటివి చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం అధికారులు కూడా పనులకు ఆమోదం తెలిపారు. అంతే... ‘లోకం’మెచ్చిన పనులను అడ్డుకునేందుకు అమ్మగారి భర్త రంగంలోకి దిగారు. తాము ఎక్కడ చెబితే అక్కడే పనులు చేపట్టాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. అమ్మగారి పీఏ కూడా ‘రాజు’ అవతారంలో అధికారులకు ఆదేశాలు జారీచేసేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను కూడా ఆపాలని చెబుతుండడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. చేస్తే మేము చెప్పినట్లు చేయండి.. లేదా సెలవుపై వెళ్లిపోండి అని వాళ్లిద్దరూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఒక జేఈ స్థాయి అధికారి ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం.

పనులు నిలిపివేసి...

నెల్లిమర్ల ఎంపీపీ అంబళ్ల సుధారాణి స్వగ్రామం ఒమ్మి పంచాయతీలో చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఉపాధిహామీ నిధులతో ఇటీవల శ్రీకారం చుట్టారు. జేసీబీలను ఏర్పాటు చేసి కాలువ పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న అయ్యగారు, సహాయకుడు ఫీల్డ్‌లోకి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఎవరికి చెప్పి పనులు చేస్తున్నారని అక్కడున్న కూలీలతో వాగ్వాదానికి దిగారు. వెంటనే జేఈ, డీఈలకు ఫోన్‌చేసి తక్షణమే పనులు ఆపాలంటూ హుకుంజారీచేశారు. అభివృద్ధి పనులు ఆపడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము లేనప్పుడు వచ్చి పనులు ఆపారని... ఈ సారి గ్రామంలోకి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారట. కొత్తపేట గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులను ఇదే తరహాలో నిలిపివేశారు.

అసంబద్ధమైన ఆలోచనలతో తమను బెదిరిస్తున్న ప్రజాప్రతినిధి భర్తతో వేగలేక పోతున్నాం అంటూ ఉపాధిహామీ అధికారులు లోలోన బాధపడుతున్నారు. ఈయనకు పాలసీ తెలియదు.. చెబితే వినేరకం కాదు. ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తూ విరుచుకుపడితే ఉద్యోగాలు ఎలా చేస్తాం అని మదనపడుతూ అధికారులు సెలవుపై వెళ్లిపోతున్నారని ఉద్యోగవర్గాల సమాచారం. ఇప్పటికే నెల్లిమర్ల, డెంకాడ జూనియర్‌ ఇంజినీర్లు, డీఈ సెలవుపై వెళ్లిపోయారు. కొన్నాళ్లు ఆగి వద్దాం.. అప్పటికి వేరే చోట పోస్టింగ్‌ వెతుక్కుందాం.. ఈ తలనొప్పులు లేకుండా ఉద్యోగం చేసుకునే చోట పోస్టింగ్‌ దొరికితే మేలు అనే భావనలో వారున్నారని తెలుస్తోంది. భోగాపురం, పూసపాటిరేగ జూనియర్‌ ఇంజినీర్లు కూడా అయ్యగారి మెహర్బానీతో భరించలేక సెలవుమీద వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

భార్య అధికారంతో అధికారులపై

భర్త స్వారీ

గ్రామాల్లో తాము చెప్పే పనులే

చేపట్టాలని హుకుం

ఉపాధి హామీ పనుల్లో జోక్యం

అనుమతులు ఇవ్వద్దని అధికారులపై ఒత్తిడి

సామూహికంగా సెలవుకు

ఇంజినీరింగ్‌ అధికారుల నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement