గ్రోత్‌లేని నాణ్యత..!
బొబ్బిలి: ఉత్తరాంధ్రలోనే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నది బొబ్బిలి గ్రోత్ సెంటర్ ప్రాంతం. ఇక్కడ దాదాపు 370 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో చిన్నాపెద్దా కలిపి 140 వరకు పరిశ్రమలు నడుస్తున్నాయి. దాదాపు 35 ఏళ్ల కిందట ఇక్కడ నిర్మించిన ప్రధాన, అంతర్గత రహదారులు ఇప్పుడు గోతులమయమయ్యాయి. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. గ్రోత్ సెంటర్‌కు వచ్చే.. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు 10 నుంచి 40 టన్నుల బరువు కలిగినవి ఉంటాయి. బెర్రీ, ఆర్‌వీఆర్ పరిశ్రమలకు వెళ్లే రోడ్లతో పాటు నారాయణప్పవలస వెళ్లే ప్రధాన రహదారి, ఎం.బూర్జివలస, గున్నతోట వలస,మెట్టవలస ప్రాంతాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. దీనిపై ఏపీఐఐసీ అధికారులు స్పందించారు. రోడ్ల దుస్థితితో పాటు పరిశ్ర,మలకు నీటిని సరఫరా చేసే మోటార్లు, స్లంప్‌లను బాగుచేసేందుకు ఎంఎస్‌ఈ డీపీ (మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రోత్ సెంటర్ అభివృద్ధి పనుల పేరున చేసిన ప్రతిపాదనలతో సుమారు రూ.2.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడం, కొన్ని కంపెనీల వరకే రోడ్లును బాగుచేయడం వంటివి విమర్శలకు తావిస్తున్నాయి.
● కొన్ని కంపెనీలకే వీధి దీపాల వెలుగులు
గ్రోత్ సెంటర్‌లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో ఉన్న విద్యుత్ లైట్లు (వీధిలైట్లు) పనిచేయడం లేదు. దీంతో వీటి మరమ్మతుల కోసం రూ.20 లక్షల ఐలా నిధులు మంజూరు చేశారు. కానీ నేటికీ ఆ పనులు సాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. మిగిలిన చోట్ల లైట్లు లేవు. ఇదే అదునుగా గ్రోత్ సెంటర్‌లో ఇటీవల కొన్ని టన్నుల ఇసుకను దొంగిలించుకుపోయిన సంగతి తెలిసిందే.!
చర్యలు తీసుకుంటాం
రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత లోపించడంపై చర్యలు తీసుకుంటాం. లైట్లు, బుష్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. మొత్తం పనులన్నీ జరుగుతాయి. రోడ్ల మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో చేస్తాం.
– ఎం.మురళీమోహన్,
జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ
తూతూమంత్రంగా గ్రోత్ సెంటర్‌లో రోడ్ల నిర్మాణం
నాణ్యతకు తిలోదకాలు
వేసిన రెండు నెలలకే గోతులమయమైన రోడ్లు
హెరిటేజ్ వరకే పరిమితమైన
మరమ్మతులు
గ్రోత్‌సెంటర్‌లో 1140 ఎకరాల స్థలంలో 370 ప్లాట్ల వెంబడి తుప్పలు, డొంకలు చెట్ల మాదిరి పెరిగిపోతే కేవలం ఒకరిద్దరికి చెందిన వారికి మాత్రమే బుష్ క్లియరెన్స్ పనులు అప్పగించారు. కేవలం బుష్ క్లియరెన్స్ కోసమే రూ.14 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం ఉమ్మితడిగానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోడ్లు కనిపించనంతగా డొంకలు పెరిగాయంటే బుష్ క్లియరెన్స్ జరిగిన తీరును అర్థం చేసుకోవచ్చు.
గ్రోత్‌లేని నాణ్యత..!
గ్రోత్‌లేని నాణ్యత..!


