విద్యార్థి మరణానికి పూచీకత్తు..!
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరడం, కొందరు మరణించడం షరామామూలుగా మారింది. అయితే... ఓ పదో తరగతి విద్యార్థి మృతిని దాచిపెట్టడం, మృతికి తాము కారణం కాదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాఠశాల హెచ్‌ఎం పేరున పూచీకత్తుపత్రం రాయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల సిబ్బంది తీరుపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. మరణానికి కారణం ఏదైనా కావచ్చని, పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులతో పూచీకత్తు రాయించడం గతంలో ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలోనే విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తాడంగి అవిష్ (15) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. అవిష్‌ది గుమ్మలక్ష్మీపురం మండలం వాడజంగి గ్రామం. విద్యార్థి చిన్నాన్న కుమార్తె ఈ నెల 13న మృతి చెందింది. ఆమె అంత్యక్రియల కోసం పాఠశాలకు వచ్చి అవిష్‌ను ఇంటికి తీసుకెళ్లారు. మరుసటిరోజు అవిష్ అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తపడ్డారు. ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అవిష్ మృతి చెందాడని, ఈ ఘటనకు పాఠశాల సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు డెక్కన్న, డోరమ్మ రాతపూర్వకంగా తెలియజేసినట్టు వారితో వేలిముద్రలు వేయించారు. పాఠశాల సిబ్బంది అమానవీయంగా రాయించుకున్న పూచీకత్తు పత్రం ఇప్పుడు వెలుగు చూడడంతో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు విస్తుపోతున్నారు. అందివచ్చిన కుమారుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చాల్సిన సిబ్బంది ఎవరి సూచనల మేరకు ఇలా పూచీ కత్తు పత్రం రాయించారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరణానికి కారణాలు ఏవైనా కావచ్చని, నిరక్షరాస్యులైన గిరిజనులతో వేలిముద్రలు వేయించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవంగా మృతిచెందిన అవిష్ ఏడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థికి వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చేసినట్టు సమాచారం. విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం అర్థంకాని ప్రశ్నగా మారింది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
భగ్గుమంటున్న గిరిజన సంఘాలు
ఇలాంటిది ఎన్నడూ చూడలేదంటూ
ఆవేదన
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో
వేలిముద్రలు


