సీటుకు
కార్పొరేటర్ రేసులో ఉండాలంటే రూ.రెండు కోట్లు చూపించాల్సిందే... టీడీపీ, జనసేన కార్పొరేటర్ ఆశావహులకు పార్టీనేతల అల్టిమేటం కార్పొరేషన్ ఎన్నికల హడావుడిలో భాగంగా మంతనాలు నియోజకవర్గాల వారీగా ఆశావహులతో విడిగా సమావేశాలు కీలక స్థానాల్లో రూ.3 కోట్లు చూపించాల్సిందేనంటున్న పార్టీ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్న ఆశావహులు
‘కార్పొరేటర్ టికెట్ కోసం పోటీలో నిలబడాలంటే కనీసం రూ.2 కోట్లు లిక్విడ్ క్యాష్ సిద్ధం చేసుకోవాలి. అదే కాస్త క్రేజ్ ఉన్న వార్డు అయితే ఆ రేటు రూ.3 కోట్లకు చేరుతుంది. ఆ మొత్తం అకౌంట్లలోనో, భూముల రూపంలోనో కాదు.. టేబుల్ మీద చూపించాల్సిందే!’
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల నగారా మోగకముందే, ఆశావహుల జేబులకు చిల్లులు పెట్టే ‘ఓపెన్ బిడ్డింగ్’ దందా మొదలైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వా ర్డుల వారీగా తెరవెనుక జరుగుతున్న పరిణామాలు చూస్తే సామాన్యుడికి కళ్లు బైర్లు కమ్మడం ఖాయ మన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట విడివిడిగా వన్–టు–వన్ ఆర్థిక సామర్థ్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత బేరసారాలు కుదిరిన బ్యాచ్‌లతో రహస్య మంతనాలు జరిపి.. అభ్యర్థుల అర్హతలను కూటమి నేతలు బేరీజు వేసుకుంటున్నారు.
పోనీ.. ఇంతటితో కథ ముగిసిందా అంటే అదీ లేదు. కేవలం ఎన్నికల ఖర్చుకే ఆ మొత్తం అనుకుంటే పొరపాటేనని, టికెట్ ఇప్పించేందుకు ‘పెద్దల ఆశీర్వాద రుసుము’ కింద విడిగా ఎంత సమర్పించుకోవాలో కూడా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే సంకేతాలు వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ‘మా వాటా మాకు ముట్టజెప్పండి.. ఆ తర్వాత వార్డులో మీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోండి’ అన్న ధోరణిలో టీడీపీ, జనసేన కీలక నేతల వ్యవహారం సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
తలలు పట్టుకుంటున్న కేడర్
నిన్నటిదాకా పార్టీ జెండాను భుజాన మోసిన కేడర్.. నేతల వ్యవహారం చూసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ‘ప్రజా సమస్యలపై పోరాడాం, వార్డులో పట్టుంది, ప్రజల్లో పలుకుబడి ఉంది’ అని చెప్పుకుంటూ వెళ్లిన వారికి.. ‘అవన్నీ ఎన్నికలయ్యాక చూద్దాం తమ్ముడూ.. ముందు ఆ రూ.2 కోట్లు ఎక్కడున్నాయో చూపించు’ అనే ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయని చర్చ జరుగుతోంది. ఇటీవల జనసేన ముఖ్య నేత దక్షిణ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ టికెట్ కోసం పోటీలో ఉండాలన్నా.. పేరును అధిష్టానానికి పంపించాలన్నా.. కచ్చితంగా రూ.2 కోట్లు క్యాష్ చూపించాల్సిందేనని తెగేసి చెప్పేశారట. టీడీపీ కూడా తక్కువేమీ కాదన్నట్లుగా.. పార్టీ జిల్లా ముఖ్య నేతను కలిసిన ఓ మాజీ కార్పొరేటర్.. తనకు మళ్లీ అదే వార్డు టికెట్ కావాలని కోరారంట. దీనిపై స్పందించిన సదరు నేత.. ‘టికెట్ ఏముంది లే.. ఎలాగూ లాస్ట్ టర్మ్ కార్పొరేటర్‌గా బాగానే సంపాదించుకున్నావు కదా.. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.3 కోట్లు రెడీ చేసుకొని చూపిస్తే పరిశీలన జాబితాలో పేరు చేరుస్తా’ అని చెప్పారని తెలిసింది. దీంతో సదరు ఆశావహ అభ్యర్థి కంగుతిని, ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.
మళ్లీ ‘ఓటుకు నోటే’ ఆయుధమా?
టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో డబ్బునే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో.. చంద్రబాబు అస్త్రమైన ‘ఓటుకు నోటు’ విధానాన్నే నమ్ముకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల బలం కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమేనని భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ‘ధనిక’ నాయకులకు ఎర్ర తివాచీ వేస్తూ.. అసలైన కేడర్‌ను ‘ఖర్చు పెట్టలేరు’ అన్న ఒకే ఒక్క కారణంతో పక్కన పెడుతున్నారనే ఆగ్రహం కిందిస్థాయిలో వ్యక్తమవుతోంది. కార్పొరేటర్ ఎన్నికలకే ఇంత రేటు ఫిక్స్ చేశారంటే.. గెలిచిన తర్వాత ఆ ప్రజాప్రతినిధులు ఇంకెంత పిండుకుంటారో అర్థం చేసుకోవడం విశాఖ ఓటర్లకు పెద్ద కష్టమేమీ కాదనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి గెలిచే ప్రజాప్రతినిధి రేపు డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాడా? లేక పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టుకునే మార్గాలు వెతుక్కుంటాడా? అన్న ప్రశ్నలు గల్లీల్లో వినిపిస్తున్నాయి.


