సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సీపీ అక్షింతలు! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సీపీ అక్షింతలు!

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

పోలీసుల సొంత నిర్ణయాలపై కమిషనర్‌ ఆగ్రహం

పీఎస్‌లో లా అండ్‌ ఆర్డర్‌ కేసు నమోదుపై మండిపాటు

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. టూ టౌన్‌కు బదిలీ

ద్వారకానగర్‌: సైబర్‌ క్రైమ్‌ పోలీసుల అత్యుత్సాహం నగర పోలీస్‌ శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. స్టేషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించిన కేసు నమోదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ‘సైబర్‌ క్రైమ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ కేసు’ అనే శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సీరియస్‌గా స్పందించారు. కేసుల నమోదులో నిబంధనలను పక్కనపెట్టి వ్యవహరించడంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అక్షింతలు వేసినట్లు సమాచారం. కేసును జీరో ఎఫ్‌ఐఆర్‌ ద్వారా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే..

ఓ సైబర్‌ క్రైమ్‌ కేసులో నిందితుడు సుగ్గున శివ నారాయణను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితుడిని కోర్టు నుంచి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్న సమయంలో తమ పట్ల దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడంటూ సైబర్‌ క్రైమ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జీవన్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు చేయడం వివాదానికి కారణమైంది. లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించిన ఘటనపై సంబంధిత ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సి ఉండగా, సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో నమోదు చేయడంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘సాక్షి’ కథనంతో కదలిక

ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ‘సైబర్‌ క్రైమ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ కేసు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో కేసుల నమోదు విషయంలో పోలీస్‌స్టేషన్‌ పరిధి, విధివిధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుసరించిన తీరుపై సీపీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సొంత నిర్ణయాలతో కాకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆయన స్పష్టం చేసినట్లు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీపీ ఆదేశాల నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి గంటలో కేసును టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది.

పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు

కేసుల నమోదు విషయంలో నిబంధనలను అమలు చేయాల్సిన పోలీసులే వాటి పరిధిని విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు స్వీకరించడం, కేసు నమోదు చేయడం, అవసరమైతే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడం వంటి అంశాల్లో స్పష్టమైన విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో పోలీస్‌స్టేషన్ల పరిధి, కేసుల నమోదు విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement