వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

స్వర్ణ కవచ అలంకరణలో కనకమహాలక్ష్మి ● శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభం

డాబాగార్డెన్స్‌: నగరంలోని బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి స్వర్ణ కవచ అలంకరణ చేసి, 108 బంగారు పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు వేదమంత్రాలు, నాదస్వరాల నడుమ శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. శోభారాణి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అమ్మవారి అలంకరణకు లక్కీ షాపింగ్‌ మాల్‌, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సోమవారం అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా లక్ష చామంతులతో పూజలు నిర్వహించనున్నారు.

ప్రత్యేక సేవలు నిలిపివేత

శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు అమ్మవారి దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించే పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పద్మారాధన, శుక్రవారం నిర్వహించే క్షీరాభిషేకం, శనివారం నిర్వహించే లక్ష తులసి పూజతో పాటు ఇతర విశేష సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement