రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
క్రికెట్ ఆడేందుకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి..
ఒక్కొక్కరే కుమారులు.. కుటుంబాల్లో తీరని శోకం
కొమ్మాది/అల్లిపురం: అప్పటివరకు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. దాహం వేయడంతో వాటర్ బాటిళ్ల కోసం బయటకు వెళ్లారు. తిరిగి మైదానానికి వస్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితుల జీవితాలు అర్ధంతరంగా ముగిశాయి. ఒకరు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. చివరకు ప్రాణస్నేహితులిద్దరూ ఒకేసారి అంతిమయాత్ర సాగించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
క్రికెట్ ఆడేందుకు వెళ్లి..
అల్లిపురం జెండాచెట్టు ప్రాంతానికి చెందిన వాడమొదుల అఖిల్ (19), పిల్లా ధనుంజయ్ (20) స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో భీమిలి బీచ్ రోడ్డులోని కె.నగరపాలెం జంక్షన్ సమీపంలో ఉన్న పాత గోకార్టింగ్ మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు మైదానానికి చేరుకుని స్నేహితులతో కలిసి ఆటలో మునిగిపోయారు. కొంతసేపటి తర్వాత దాహం వేయడంతో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసేందుకు అఖిల్, ధనుంజయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
మలుపు వద్ద అదుపుతప్పి..
కె.నగరపాలెం కూడలిలో దుకాణాలు తెరవకపోవడంతో సమీపంలోని ఉప్పాడకు వెళ్లి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేశారు. తిరిగి మైదానానికి వస్తుండగా ఛత్రపతి శివాజీ విగ్రహం సమీపంలోని మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న అఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధనుంజయ్‌ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆటపాటలతో సందడిగా గడపాల్సిన వయసులో ఇద్దరూ విగతజీవులుగా మారడం వారి స్నేహితులను కలచివేసింది.
ఇంటికి ఒక్కొక్కరే కుమారులు..
చేతికందివచ్చిన కుమారులు అర్ధంతరంగా మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ధనుంజయ్ తండ్రి ఎల్లాజీ కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, అఖిల్ తండ్రి మురళీ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. ధనుంజయ్ ఓ శిక్షణ సంస్థలో వెల్డింగ్ శిక్షణ పొందుతున్నాడు. తమకు అండగా ఉంటారనుకున్న కుమారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
పక్కపక్కనే స్నేహితుల అంతిమయాత్ర
ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరూ ప్రాణస్నేహితులు కావడంతో బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇద్దరి మృతదేహాలను వేర్వేరు వాహనాల్లో పక్కపక్కనే ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. కలిసి క్రికెట్ ఆడిన స్నేహితులు.. చివరకు ఒకేసారి అంతిమయాత్ర సాగించడం అందరినీ కన్నీరు పెట్టించింది. ధనుంజయ్ తండ్రి ఎల్లాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిళ్లా ధనుంజయ్ (ఫైల్)
వాడమొదుల అఖిల్ (ఫైల్)


