సింహాచలం: యోగసాధకుల ఆసనాల ఝరితో పులికించింది. రాజగోపుర ప్రాంగణం అభ్యాసకుల సూర్య నమస్కారాలతో ఆధ్యాత్మిక శోభను అలంకరించుకుంది. ఓం ఫ్రీ యోగ– సింహాచలం దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 108 రౌండ్ల సూర్య నమస్కారాల కార్యక్రమం విజయవంతమైంది. 325 మందికి పైగా యోగ సాధకులు శిక్షకులు హాజరై ప్రభాకరుడికి ప్రణామ మందించారు. యోగా నిపుణులు డాక్టర్ చిలుకా వెంకట రమేష్ పర్యవేక్షణలో ఉదయం 5.30గంటల నుంచి 7గంటల వరకు ఈకార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం ప్రధానార్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ప్రారంభించారు.
ముచ్చటగా మూడోది...
యోగాతోనే ఆరోగ్య భాగ్యం అనే నినాదంతో విశాఖలో వివిధ కేంద్రాలు వేదికలుగా ఉచిత యోగాను నేర్పిస్తున్నామని.. ఓం ఫ్రీ యోగ సంస్థ ఫౌండర్ డాక్టర్ చిలుక వెంకట రమేష్ చెప్పారు. ఈ ప్రచారంలో భాగంగానే తాము ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధ సూర్య క్షేత్రం అరసవల్లిలో... ఒడిశాలోని కోణార్క్ సూర్య భగవానుడి ఆలయ ప్రాంగణంలో ఇప్పటివరకు 108 రౌండ్ల సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆదివారం సింహగిరిపై తాము చేసిన కార్యక్రమం మూడవదని.. సింహాచలేసుని సాక్షిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగాను అనునిత్యం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. 325 మందికి పైగా యోగాభ్యాసకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సింహాచలం దేవస్థానం అందించిన సహకారం మరువలేనిది అన్నారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు అన్ని విధాలా సహకరించారని.. ఆరోగ్య భాగ్యం కోసం తాము చేస్తున్న యజ్ఞానికి అండగా నిలిచారని తమ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


