భర్తను చంపి.. అండమాన్‌లో దాక్కొని! | - | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. అండమాన్‌లో దాక్కొని!

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

కోర్టుకు డుమ్మా.. ప్రియుడితో కలిసి స్వరాజ్‌ ద్వీప్‌లో మకాం

పేర్లు మార్చి.. నకిలీ ఆధార్‌తో తప్పించుకునే ప్రయత్నం

కనిపెట్టి అండమాన్‌ వెళ్లి అరెస్ట్‌ చేసిన భీమిలి పోలీసుల బృందం

అల్లిపురం: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసిన కేసులో కోర్టు విచారణకు హాజరుకాకుండా అండమాన్‌లో తలదాచుకున్న భార్య, ఆమె ప్రియుడిని భీమిలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైమ్‌ నంబర్‌ 509/2022 కేసులో నిందితులైన వాడమోదుల నూకరాజు అలియాస్‌ శ్రీనివాసరావు, వంక జ్యోతిలను ఈ నెల 9న స్వరాజ్‌ ద్వీప్‌లో గుర్తించారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ–1 వి.ఎన్‌.మణికంఠ చందోల్‌ కేసు వివరాలను వెల్లడించారు.

ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి..

భర్తను అడ్డు తొలగించడానికి భార్య జ్యోతి ప్రియుడు నూకరాజు సలహా మేరకు భర్త పైడిరాజుకు ఇచ్చే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత కంటుముచ్చు భూలోకతో కలిసి గొంతు నులిమి, వైర్‌తో బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మోటార్‌ సైకిల్‌పై విశాలాక్షినగర్‌కు తరలించారు. మరుసటి రోజు అనారోగ్యంతో కేజీహెచ్‌లో మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి పెదవాల్తేరు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ వ్యవహారంలో మృతుడి సోదరుడు వ్యక్తం చేసిన అనుమానాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో భార్య జ్యోతి, ఆమె ప్రియుడు నూకరాజులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విశాఖపట్నం ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణలో ఉంది.

కోర్టుకు హాజరుకాకుండా.. అండమాన్‌లో..

అయితే, నిందితులు నూకరాజు, జ్యోతి కోర్టుకు హాజరుకాకుండా పరారయ్యారు. చైన్నె మీదుగా అండమాన్‌ చేరుకున్న వీరు, స్వరాజ్‌ ద్వీప్‌లో పేర్లు మార్చుకుని నకిలీ ఆధార్‌ కార్డులతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు భీమిలి సీఐ జి.దివాకర్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అండమాన్‌కు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని పోర్ట్‌బ్లెయిర్‌ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ పొందింది. నిందితురాలి ఇద్దరు పిల్లలను కూడా విమానంలో విశాఖకు తీసుకొచ్చి బంధువులకు సురక్షితంగా అప్పగించారు. నిందితులను ఇక్కడి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొని కేసు దర్యాప్తులో పురోగతి సాధించిన సీఐ జి.దివాకర్‌ యాదవ్‌, మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ జి. శ్రీదేవి, కానిస్టేబుళ్లు వి. అప్పారావు, ఎం. గౌరీరెడ్డిలను పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తరఫున అధికారులు అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement