మహారాణిపేట: సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపై కేజీహెచ్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీకి చెందిన నలుగురు నాయకులకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు తక్షణమే సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. జేఏసీ అధ్యక్షురాలు ఆశా, జిల్లా కన్వీనర్ ఎం.సీహెచ్.కిశోర్‌రావు, కో–చైర్మన్ పి.సతీష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోటీశ్వరరావులకు నోటీసులు అందాయి. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నాయకులు స్పష్టం చేశారు. సమ్మెలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
రెండో రోజుకు సమ్మె
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. సమ్మెకు సంబంధించి 45 రోజుల ముందే కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చామని జేఏసీ కన్వీనర్ కిశోర్‌రావు తెలిపారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం తమ ప్రధాన డిమాండ్లని చెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగినట్లు వివరించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని జేఏసీ అధ్యక్షురాలు ఆశ డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని జేఏసీ కో–చైర్మన్ పైడిరాజు కోరారు.
వైద్య సేవలకు బ్రేక్
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె ప్రభావం కేజీహెచ్‌తోపాటు జిల్లాలోని పలు టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లపై పడింది. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు కలిపి సుమారు 910 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్‌లో గురువారం జరగాల్సిన పలు శస్త్రచికిత్సలను తాత్కాలికంగా వాయిదా వేశారు.


